Jul 29,2021 23:25

నిరసన ప్రదర్శన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి - నరసరావుపేట : అప్కాస్‌ విధానం కారణంగా రిటైర్‌ అయిన మున్సిపల్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మృతి చెందిన, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ కార్మికులు గురువారం ఆందోళన చేసట్టారు. మున్సిపల్‌ కార్యాలయం నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ 20-25 ఏళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎ.సాల్మన్‌, పి.రాజు, టి.మల్లయ్య, నరసింహరావు, శేఖర్‌, శ్రీను, రోశయ్య పాల్గొన్నారు.