Sep 30,2022 23:14

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూలు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రజకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మూగజీవాల (గాడిదల)తో మున్సిపల్‌ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ధర్నా చేశారు. ధర్నానుద్ధేశించి ఎపి రజక మృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.గురుశేఖర్‌ మాట్లాడుతూ.. గాడిదల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని మున్సిపల్‌ అధికారులు వృత్తిదారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని లారీలో తీసుకొచ్చి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఉంచారని తెలిపారు. తీసుకెళ్లిన జీవాలకు మేత లేకుండా ఉంచడం బాధాకరమన్నారు. గాడిదల వల్లే తమకు ఉపాధి ఉందని, వాటిపైనే తమ వృత్తి ఆధారపడి ఉందని తెలిపారు. మూగజీవాలకు మేత లేకుండా బంధించిన సంబంధిత అధికారులపై మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని, గాయపడిన గాడిదలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రజకులకు దోభీఘాట్లు, గాడిదల కోసం ప్రత్యేక షెడ్లు నిర్మించాలని కోరారు. ప్రత్యేక షెడ్లను నిర్మిస్తే గాడిదలను రోడ్లపైకి కాకుండా షెడ్లలో ఉంచుతామని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆవాజ్‌ కమిటీ నగర నాయకులు అబ్దుల్‌ దేశారు, రజక వృత్తిదారుల సంఘం ఓల్డ్‌ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు జయమ్మ, సిహెచ్‌ శ్రీనివాసులు, న్యూ సిటీ కార్యదర్శి సి.శేషాద్రి పాల్గన్నారు.