Aug 18,2022 23:17

సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వరరావు

ప్రజాశక్తి- కంచరపాలెం : రజకులకు సామాజిక రక్షణ చట్టంచేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యాన గురువారం గోపాలపట్నంలో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు బి ఆనందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈశ్వరరావు మాట్లాడుతూ, రజకులకు వృత్తిరీత్యా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పల్లెల్లో ఉపాధి లేక రజకులు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వచ్చి అపార్ట్‌మెంట్స్‌ వాచ్‌మ్యాన్లుగానూ, ఇంటి పని వారలు గాను జీవిస్తున్నారని తెలిపారు. వీరి బలహీనతను ఆసరా చేసుకొని ఉన్నత వర్గాలకు చెందిన పలువురు దాడులకు దౌర్జన్యాలకు, హత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రజకులపై సుజాతనగర్‌, నాగమల్లి లే-అవుట్‌లోను హత్యలు జరిగాయని తెలిపారు. ఇటువంటి దారుణాలకు ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని మహాసభ తీర్మానించిందని పేర్కొన్నారు. రజక వృత్తిదారులు జిల్లావ్యాప్తంగా 50 వేలు మంది ఉన్నారని తెలిపారు. గోపాలపట్నం జోన్‌ పరిధి వేపగుంట, నాయుడు తోట, శ్రీనివాస్‌ నగర్‌, అప్పన్నపాలెం ప్రాంతాల్లో రజకులకు దోబీఘాట్లు, స్థలాలు, పరికరాలు లేక వృత్తి సాగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నా శిథిలావస్థలకు చేరుకున్నాయని, వాటికి మరమ్మతులు చేయాలని, లాండ్రి వృత్తులకు జగనన్న చేదోడు పథకం అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.సుబ్రహ్మణ్యం, ఎన్‌.త్రినాథ్‌, డి.లక్ష్మి, పి.అప్పలరాజు, సిహెచ్‌.రాజేష్‌, ఎస్‌.అప్పలరాజు, వి.ఆదినారాయణ, సిహెచ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.