Dec 07,2020 09:26

చెన్నై : తమిళనాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఏర్పాటు చేయబోయే పార్టీ వెనుక కమల దళ వ్యూహం ఉన్నట్లు విడుదలై చిరుతైగల్‌ కచ్చి ఎంపి తిరుమావళన్‌ విమర్శించారు. సొంత ఆలోచనలతో పార్టీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని రజనీ తీసుకున్నట్లుగా కనిపించడం లేదన్నారు. ఎవరికో భయపడి, ఒత్తిడి గురై, బెదిరింపులకు తలగ్గి పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఒత్తిళ్లతో రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి రజనికీ ఏర్పడి ఉండటం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే అందుకు తగ్గట్లు శ్రమించాల్సి ఉంటుందని సిపిఎం నేత బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌ పగటి కలలు కనడం ఆపాలని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌ అన్నట్లుగా పార్టీ ఏర్పాటు చేస్తానని, ఎన్నికలంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ మాట్లాడుతూ తన మక్కల్‌ మండ్రంలో మూడేళ్లుగా శ్రమిస్తున్న వారిలో సమర్థవంతమైన నాయకులు ఎవ్వరూ రజనీకి కనిపించలేదా? అని ప్రశ్నించారు. బిజెపి నుండి వచ్చిన అర్జున్‌మూర్తికి, అన్ని పార్టీలను చుట్టి వచ్చిన తమిళరవి మణియన్‌లకు పార్టీ ఏర్పాటు చేయకుండానే పదవులను కట్టబెట్టడం చూస్తే దీని వెనుక బిజెపి వ్యూహం వున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. తనను నమ్ముకున్న వాళ్లను కాకుండా, బయటి వ్యక్తులను పదవులివ్వడం పట్ల అభిమానులు కూడా హర్షం వ్యక్తంచేయరని అన్నారు.