Sep 29,2022 16:41

న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయడం లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ గురువారం ప్రకటించారు. తన విధేయులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు   నైతిక బాధ్యత వహిస్తున్నట్లు  తెలిపారు. బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న గెహ్లాట్‌ గురువారం మధ్యాహ్నం గంటన్నర పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నుండి తాను వైదొలుగుతున్నానని అన్నారు. అయితే  అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వానికే వదిలేశానని చెప్పారు. అలాగే రాజస్థాన్‌ సంక్షోభానికి కారణమైనందుకు సోనియాగాంధీకి క్షమాపణలు తెలిపారు.

ఇటీవల అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్‌ను కోరానని, ఆయన నిరాకరించారని, దీంతో ఆను పోటీ చేస్తానని చెప్పానని అన్నారు. అయితే ఒకే వ్యక్తి, ఒకే పదవి అనేది పార్టీ తీర్మానమని, ఆ తీర్మానాన్ని ఆమోదించలేని పరిస్థితి ఎదురైందని అన్నారు. అదే సమయంలో రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని, ఆ పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ.. పోటీ నుంచి వైదొలుగుతున్నానని వెల్లడించారు.

దీంతో అధ్యక్ష ఎన్నిక బరిలో సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ పోటీ ఖరారైంది. శుక్రవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు. దిగ్విజరు సింగ్‌ పది సెట్ల నామినేషన్‌ పత్రాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపి శశిథరూర్‌ కూడా శుక్రవారమే నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు.