May 17,2022 23:31

వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకుంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తదితరులు

ప్రజాశక్తి- రాజవొమ్మంగి
రంపచోడవరంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, ఇతర సౌకర్యాలు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు, అత్యవసర కేసులు వస్తుంటాయని తెలిపారు. తగిన సౌకర్యాలుగాని, మందులుగాని, పూర్తిస్థాయిలో సిబ్బందిగాని లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మొత్తం 19 మంది వైద్యులు ఉండవలసి ఉండగా, కేవలం 9 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ముఖ్యమైన విభాగాలకు చెందిన వారుగాని, జనరల్‌ విభాగానికి చెందిన వైద్య నిపుణులు గాని లేరన్నారు. ఏజెన్సీలో రహదారులు సక్రమంగా లేని ప్రాంతాల నుండి అత్యవసర పరిస్థితుల్లో రాలేని వారికి అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్య పరిస్థితులు మెరుగు మెరుగుపరచడానికి, వైద్య సహాయం అందుబాటులోకి తీసుకురావడానికి రంపచోడవరంలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. రంపచోడవరంలో డ్రగ్‌ స్టోర్‌ ఏర్పాటు చేసి పీహెచ్సీలకు రోగులకు సరిపడా మందులు సప్లై చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.అరుణ్‌, రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌, సిపిఎం నాయకులు ఎం.వాణిశ్రీ, టి.తులసి తదితరులు పాల్గొన్నారు.