Sep 22,2022 23:59

చిన్నారిని చేతులతో మోసుకొస్తున్న బంధువులు

ప్రజాశక్తి-దేవరాపల్లి
మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు వీలభద్రపురం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆ గ్రామ గిరిజనులు అనారోగ్యానికి గురైతే వారి కష్టాలు వర్ణాతీతం. గురువారం ఈ గ్రామానికి చెందిన గమ్మేల కావ్య అనే చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో 108 వాహనానికి పోన్‌ చేశారు. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వీరభద్రపురం నుంచి చింతలపూడి వరకు కిలోమీటరు మేరకు చేతుల మీద పెట్టుకొని మోసుకొచ్చారు. చింతపూడి నుంచి కాశీపురం వెళ్లే రోడ్డు మరమ్మతుల కోసం రహదారికి అడ్డంగా రాళ్లకుప్పలు వేయడంతో వాహనం వచ్చే అవకాశం లేదు. దీంతో చింతలపూడి నుంచి ద్విచక్ర వాహనంపై ఐదు కిలోమీటర్ల మేరకు సీతంపేట తీసుకొచ్చి అక్కడ 108 వాహనం ఎక్కించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.
డిప్యూటీ సిఎం ఇలాకాలో గిరిజనుల పరిస్థితి అధ్వానం
75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలిమోతలు తప్పడం లేదు. గతంలో వీలభద్రపురం గ్రామంలో వారం రోజులు వ్యవధిలో రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక గమ్మేల ప్రవీణ్‌, సూకురి చిన్నారి అనే ఇద్దరు చిన్నారులు మృత్యువాత చెందారు. రెండు రోజుల క్రితం మాడుగుల మండలం శంకరం పంచాయతీ పరిధి కొత్తవలసలో చివేరి కొండలరావుకు వైద్యం అందక ఆయన చనిపోయాడు. గిరిజనులకు రహదారి వంటి కనీస సౌకర్యాల్లేకపోవడంతో వారికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత చెందుతున్నా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కనీసం పట్టడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న విమర్శించారు. ప్రభుత్వానికి గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు. జంతువులు ప్రాణాలకు ఉన్న విలువ కూడా గిరిజనుల ప్రాణాలకు లేదా అని వెంకన్న ప్రశ్నించారు.