
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ.. నియోజకవర్గాల్లో ఎన్నో సమస్యలున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. రోడ్లు అధ్వాన్న పరిస్థితిపై ఈటా సదర్ నియోజికవర్గ ప్రజలు ఓటింగ్‌ను బారుకాట్ చేస్తామని ప్రకటించారు. రోడ్లు బాగాలేవన్న సంగతి ఎన్నోమార్లు స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వ అధికారులకు విన్నవించినా..పరిస్థితిలో మార్పు రాలేదని ఈటా పట్టణం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు బాగు చేస్తామని కచ్చితమైన హామీ ఇస్తేనే..పోలింగ్ రోజు ఓటింగ్‌లో పాల్గొంటామని హెచ్చరిక సైతం జారీచేశారు. దీనిపై చుట్టుపక్కల గ్రామాలన్నీ తీర్మానం సైతం చేయటం స్థానికంగా వార్తల్లో నిలిచింది. బిజెపి నాయకుడు విపిన్ వర్మ ఈటా సదర్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజా ఎన్నికల్లోనూ పార్టీ ఆయనకే టికెట్టు ఇచ్చింది.
మూడో దశ పోలింగ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై కుల్లా హబీబ్పూర్ గ్రామానికి చెందిన స్థానికుడు మీడియాతో మాట్లాడుతూ, ''మాది వెయ్యిమంది జనాభా కూడా లేని గ్రామం. చూడండి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. పెద్ద పెద్ద గుంతల్లో ప్రయాణం వల్ల ఎంతోమంది గ్రామస్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం వస్తే ఇక అంతే. గ్రామంలో ఉన్నవారు రోడ్డుమీదకు రాలేరు. ఆ తర్వాత కూడా రోజువారీ పనుల నిమిత్తం రోడ్లపై ప్రయాణించలేకపోతున్నా''మని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తేనే.. ఓటింగ్‌లో పాల్గొంటామని ఇప్పటికే ప్రకటించామని, అధికారులకు, రాజకీయ నాయకులకు తమ సమస్యలు తెలియజేశామని స్థానికుడు ప్రమోద్‌కుమార్ తెలిపాడు.