Nov 24,2022 09:40
  • కడప, తిరుపతి జిల్లాలకు చేరని ఉచిత బియ్యం
  • నేటికీ 50 శాతం కూడా పంపిణీకి నోచని వైనం
  • నెలాఖరు వరకూ పొడిగిస్తామన్న కమిషనర్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం (పిఎంజికెఎవై) లో భాగంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద పేదలకు ఉచితంగా ఇచ్చే బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కూడా దాటలేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మంది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుదారులు ఉండగా వీరందరికీ 19వ తేదీ నుండి 27వ తేదీ వరకూ బియ్యాన్ని ఇస్తారు. అయితే బుధవారం నాటికి 43.77 లక్షల మందికి పంపిణీ చేశారు. ముఖ్యంగా కడప, తిరుపతి జిల్లాలకు బియ్యం సరఫరా జరగలేదు. ఎఫ్‌సిఐ నుంచి బియ్యం సరఫరాలో ఆలస్యం కావడం, పౌరసరఫరాలసంస్థ వద్ద సరిపడినన్ని నిల్వలు లేకపోవడం వల్లే సరఫరా చేయలేకపోయామని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో సరఫరా కాకపోవడానికి కార్డుదారులకు అవగాహన లేకపోవడమేనని చెబుతున్నారు. రేషన్‌కార్డులు ఏ పథకం కింద ఉన్నాయో తెలియకపోవడం కూడా బియ్యాన్ని తీసుకోకపోవడానికి ఒక కారణంగా ఉందని అధికారులు వివరిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి వాట్సప్‌ మెసేజ్‌లు పెట్టే గ్రామ వాలంటీర్లు ఉచిత బియ్యం తీసుకునేందుకు అర్హత ఉన్న లబ్ధిదారులకు బియ్యం ఫలానా తేదీ నుంచి ఇస్తారనే సమాచారాన్ని తెలియజేయకపోవడమూ మరొక కారణమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎంజికెఎవై కింద రాష్ట్రానికి 3.24 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించింది. అక్టోబరు నుంచి పంపిణీ చేయాల్సిన బియ్యం నిల్వలు లేకపోవడంతో, బియ్యం కోటాను కేంద్ర ప్రభుత్వ అనుమతితో నవంబరు, డిసెంబరు, జనవరి నెలలకు రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఏది ఏమైనా ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించిన ప్రచారం గ్రామస్ధాయిలో అనుకున్నంత లేకపోవడంతో పంపిణీ గురించి లబ్ధిదారులకు తెలియక కార్డుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.