Nov 30,2022 23:02

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ విద్యా దీవెన పథకం కింద జిల్లాలో 35,818 మంది విద్యార్థులకు చెందిన 31,899 మంది తల్లుల ఖాతాలో రూ.23.18 కోట్లు జమ చేసినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. ముఖ్యమంత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విద్యా దీవెన విడుదల చేసిన నేపథ్యంలో స్థానిక మ్సుసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఎంపీ భరత్‌, కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఏ ఒక్క విద్యార్థీ చదువు మానకుండా ఉన్నత విద్య వరకు చదువుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మిన వ్యక్తి మన సిఎం అన్నారు. అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేసినట్టు చెప్పారు. జిల్లాలో 19 కాలేజీల్లో నాడు-నేడు పనులు చేపట్టామన్నారు. లింగ వివక్ష చూపకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తల్లితండ్రులకు, పిల్లలకు పిలుపు నిచ్చారు. విద్యే మన బలం అని నమ్మి మరింత మంచి భవిష్యత్తు పొందాలని కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. ఎంపీ మార్గానిభరత్‌ రామ్‌ మాట్లాడుతూ, జగనన్న విద్యా కానుక కింద ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో మంచి నాణ్యమైన విద్యను అందించే దిశ రాష్ట్రంలో పాఠశాలలు ఆధునికీకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, రుడా చైర్‌ పర్సన్‌ షర్మిల రెడ్డి, ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.సందీప్‌, బిసి వెల్ఫేర్‌ అధికారి పి సత్య రమేష్‌, పాల్గొన్నారు.