Oct 17,2020 13:50

పాట్నా : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి హామీలనిచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం ప్రాణ్‌ హమారా (మా తీర్మానం) పేరుతో శనివారం మహాకూటమి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సిఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజశ్వియాదవ్‌ మాట్లాడుతూ..నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం హమీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తామంతా ఏకతాటిపై వచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా, శక్తిసింగ్‌ గోహ్లి... తదితరులు పాల్గన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి శాసన సభ సమావేశంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి తొలి సంతకం ఉంటుందని తేజశ్వి హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ (బిజెపి, జెడియు ప్రభుత్వాన్ని ఉద్దేశించి) నడుస్తోందని, 15 సంవత్సరాలుగా నితీష్‌ కుమార్‌ రాష్ట్రాన్ని ఏలుతున్నారని, ఇప్పటి వరకు ప్రత్యేక కేటగిరి హోదా లేదని అన్నారు. బీహార్‌లో వరదలు సంభవించినప్పుడు.. నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా కేంద్ర బృందాన్ని పంపలేదని కేంద్ర బిజెపి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికలు విభజన, విద్వేషానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని రణదీప్‌ సూర్జేవాలా అన్నారు. తేజశ్వి యాదవ్‌ నేతృత్వంలో మహా కూటమి అధికారంలోకి రాగానే తొలి శాసన సభ సమావేశాల్లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లులను ఆమోదిస్తామని అన్నారు. బీహార్‌లో ఓడిపోతామన్న భయంతోనే మూడు పొత్తులతో కలిసి బిజెపి పోటీ చేస్తోందని సూర్జేవాలా వ్యాఖ్యానించారు.