Aug 05,2022 10:37

న్యూఢిల్లీ : మరోసారి రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) పెంచింది. కీలక రుణ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు శుక్రవారం ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి తెచ్చేందుకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు కీలక రుణ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్‌బిఐ రెపో రేటును పెంచడం ఇది మూడవసారి. ఆర్‌బిఐ మేలో 40 బేసిన్‌ పాయింట్ల పెంపుతో పాటు జూన్‌ దైమాసిక సమీక్షలో మరో 50 పాయింట్లు పెంచింది. తాజాగా ఈ నెల 3న ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల మేరకు మరో 50 బేసిన్‌ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంచనా వేసినట్లు 35 బేసిస్‌ పాయింట్లు కాకుండా ఆర్‌బిఐ మరింత అధిక పెంపునకు మొగ్గుచూపడం గమనార్హం. దీంతో రుణ భారం మరింత పెరగనుంది. ఈ మార్పును ముందే ఊహించిన కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ప్రారంభించేశాయి. ఫలితంగా గఅహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదా మరింత భారం కానున్నాయి.