Jul 04,2022 18:38

వర్షాకాలం వచ్చింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు కుంటలు నిండిపోయాయి. సీతాపురం ఉన్నత పాఠశాల ఆవరణమంతా వర్షం నీటితో నిండిపోయింది. విద్యార్థులు తరగతి గదిలోకి పోవడానికి ఇబ్బందిగా మారింది. ఎక్కడ కాలు పెట్టినా బురదమయం. నీరు బయటకు పోయే పరిస్థితి లేదు. పిల్లలు క్లాసు రూమ్‌లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. బయటే నిలబడిపోయారు.

అప్పుడు వచ్చారు తెలుగు మాస్టారు. ఇదంతా గమనించిన ఆయన ఒక ఆలోచన చేశారు. విద్యార్థుల సహకారంతో ఒక మూలన ఇంకుడు గుంత తవ్వించాడు. అందులో ఇసుక, కంకర, నేల బొగ్గు వేసి వర్షపు నీరు అందులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. కొంత సేపటికి పాఠశాల ఆవరణలో ఉన్న నీరంతా ఇంకుడు గుంతలోకి చేరింది. మరుసటి రోజు కూడా పెద్ద వర్షం పడింది. స్కూల్లో నీళ్లు నిలిచి ఉంటాయోమోనన్న అనుమానంగా వెళ్లారు విద్యార్థులు. కానీ, ఆశ్చర్యం! ఒక చుక్క నీరు కూడా లేదు. మొత్తం ఇంకుడు గుంతలోకి పోయాయి. దానివల్ల భూగర్భ జలాలు పెరిగి, పాఠశాల ఆవరణలో మొక్కలు పచ్చగా మారాయి. పాఠశాల్లో ఇంకుడు గుంతను నిర్మించి సమస్యను నివారించిన తెలుగు మాస్టారును ప్రధానోపాధ్యాయులు అభినందించారు.

- గుర్రం హాసిని, 8వ తరగతి,
జడ్పీ స్కూలు, రాయిలాపూర్‌, మెదక్‌ జిల్లా.