Mar 19,2023 21:55
  • అసైన్‌మెంట్‌ కమిటీలు యాక్టివేట్‌ చేయాలి : ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నట్లు పట్టణ ప్రాంతాల్లో ఆస్తులకు భూ హక్కు పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకోసమే చట్టంలో సవరణలు తెస్తున్నామని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. చుక్కల భూములు, ఇనాం భూములు చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఇక ముందు పట్టణ ఆస్తులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు క్రియేట్‌ చేయడంతో పాటు భూహక్కు పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. పట్టణ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ మునిసిపల్‌ కార్యాలయాల్లో అసెస్‌మెంట్‌ రిజిస్టర్‌లో ఉండేవన్నారు.

  • చట్టంలో మార్పులు తేవాలి : గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ఇనాం భూములు, దేవస్థాన భూములు గురించి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రభుత్వానికి సూచించారు. ఏ డిపార్టుమెంట్లో అయినా అన్యాయం జరిగినట్లు తేలితే చర్యలు ఉంటాయన్నారు. అలా కాకుండా ఆస్తులను రెవెన్యూ అధికారులు సంరక్షించే విధంగా చట్టంలో మార్పులు తేవాలని కోరారు. అసైన్‌మెంట్‌ కమిటీలను యాక్టివేట్‌ చేయాలన్నారు.

  • తిరుపతిలో పేదల ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్లు : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతిలోని మఠాలు, దేవాదాయభూముల్లో సుమారు 60 వేలమంది పేదలు 50 సంత్సరాలకు పైగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నప్పటికీ ఆ ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్లకు నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

  • రెవెన్యూ చట్టంలో మార్పులు హర్షణీయం : రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రెవెన్యూలో అవినీతి తగ్గిపోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడం హర్షణీయమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బిల్లులో ఆంధ్రప్రాంతం అని పేర్కొన్నారని, అంటే కొన్ని జిల్లాలకే పరిమితమా లేక అందులో రాయలసీమ కూడా ఉందా లేదా అనే సందేహం ఉందన్నారు. భూముల రీసర్వేలో క్యూఆర్‌ కోడ్‌ కనిపించే విధంగా చేయడం మంచిదన్నారు. చుక్కల భూముల పేరుతో అమ్ముకునే హక్కు లేదని, 12 సంవత్సరాలు ఉంటే అమ్ముకునే హక్కు చట్టం తేవడం జరిగిందని తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో అవినీతి లేకుండా చేయాలన్నారు. గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ గుంటూరు నగరంలో 180 ఎకరాలు భూమి ఉందని, ఇది ఆక్రమణలకు గురవుతోందని, ముస్లిములకు లీజు లేక అద్దె ప్రాతిపదికన ఇస్తే ఆదాయం కూడా వస్తుందని అన్నారు. వీటితో పాటు 40 ఎకరాల నుంచి అనేక మంది ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓర్వకల్లు, పాణ్యం ప్రాంతాల్లో సోలార్‌, విండ్‌ ఎనర్జీ కోసం ప్రభుత్వం భూములు తీసుకుందని, రికార్డుల్లో వాస్తవ యజమాని పేరు కాకుండా వేరొకటి పేర్లు ఉన్నాయని తెలిపారు. వాస్తవంగా ఆయా భూములు సాగుచేసుకుంటున్న నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి మాట్లాడుతూ ఇనామ్‌ భూముల సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు.