Oct 05,2022 06:19

విద్యా సంస్థలలో విద్యార్థులు హిజాబ్‌ వేసుకోకూడదని కర్ణాటక బిజెపి ప్రభుత్వం నిషేధించినప్పుడు...హిజాబ్‌ వేసుకోవడం వారి హక్కని దేశవ్యాప్తంగా అనేకమంది మహిళా కార్యకర్తలు వారికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌లను కాల్చేస్తుంటే...ఆనాడు కర్ణాటకలో విద్యార్థినులకు మద్దతు పలికిన మహిళలను బిజెపి కార్యకర్తలు హేళన చేస్తున్నారు. అందులో ఒకరు ''అమ్మాయిలు హిజాబ్‌ వేసుకోవడాన్ని సమర్ధించిన ఆ సిగ్గులేని భారతీయ మహిళలకు ఈ ఫోటోలను చూపించండి'' అన్నారు. ఎప్పటిలాగే ఆ హేళన చేసేవారు విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు.
ఇరాన్‌లో 22 ఏళ్ల ఖుర్దిష్‌ అమ్మాయి టెహ్రాన్‌లో పోలీసుల అదుపులో ఉండగా చనిపోయింది. దానితో టెహ్రాన్‌లో వరుసగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెను అదుపులోకి తీసుకోడానికి కారణం ఆమె, హిజాబ్‌ 'సరిగ్గా' ధరించలేదని. ఇరాన్‌ పోలీసులు నైతిక రక్షకులుగా వ్యవహరించడం వలన ఆమెను అదుపు లోకి తీసుకున్నారు. ఆమెను పోలీసులు తలపై కొట్టి చావబాదారని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆ దెబ్బలకు తాళలేకే ఆమె చనిపోయింది. వందలాది మహిళలు ఎంతో ధైర్యంగా నిరసనలు తెలిపారు. ఎదిరించి ఆమెకు మద్దతుగా, తమ హిజాబ్‌ లను తగులబెట్టారు. నిరసనకారులపై జరిపిన కాల్పులలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెప్తున్నాయి.
నిరసనలు తెలిపినందుకు జరిపిన కాల్పులలో మరణించిన వ్యక్తి అంత్యక్రియలలో పాల్గొన్న అతని సోదరి తన హిజాబ్‌ను చించేసింది. జుట్టు కత్తిరించి కసిగా తన పిడికిలితో శవపేటికపై వేసింది. ఇది శక్తివంతమైన నిరసనకు ఒక సూచికగా నిలిచింది. ఆ తరువాత అనేకమంది మహిళలు జుట్టు కత్తిరించుకుని, హిజాబ్‌లను తగులబెడుతున్న చిత్రాలు సామాజిక మాధ్యమాన్ని ముంచెత్తాయి. ఇరాన్‌లో దేశవ్యాప్తంగా పోలీసులు నిరసనకారులపై విరుచుకు పడుతున్నారు. ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న మహిళలకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. వాళ్ళ కోపంలో, ఆగ్రహంలో మేం కూడా భాగస్వాములం అవుతాం. ఇక్కడ జరిగింది ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ ప్రభుత్వం విద్యార్థినులను కాలేజీలకు హిజాబ్‌ తొలగించి రావాలని ఆదేశించింది. దానిని ప్రతిఘటిస్తూ అమ్మాయిలు హిజాబ్‌ వేసుకుని కాలేజీలకు వెళ్లారు. కాలేజీ గేట్ల ఆవల నిలుచుని, ఆయా సంస్థలను హిజాబ్‌ వేసుకుని లోపలికి రాడానికి తమకు అనుమతి ఇవ్వవలసిందిగా డిమాండ్‌ చేశారు. అప్పుడు వారు అవహేళనలకు గురయ్యారు. దుర్భాషలను కుాడా భరించాల్సి వచ్చింది. అంతేగాక ప్రభుత్వం వారిని బెదిరించింది. భయపెట్టింది. ప్రభుత్వానికి మద్దతుగా గూండాలు నిలిచారు. కానీ అమ్మాయిలు వెనకడుగు వేయలేదు. బెదిరిపోలేదు. వారి పోరాటాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. ఆ నిరసనకారులకు మద్దతుగా మేం నిలిచాం. చదువు, నమ్మకాలలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమనడంపై వచ్చిన వారి ఆగ్రహావేశాలలో భాగస్వాములమయ్యాం.
ఇరాన్‌ మహిళలు అణచివేతను వ్యతిరేకించడాన్ని సూచిస్తూ హిజాబ్‌లను దగ్ధం చేయడాన్ని మేము సమర్ధిస్తున్నాము. అదే సమయంలో కర్ణాటకలో హిజాబ్‌ వేసుకోవడం తమ హక్కు అనే మహిళలకు మేము మద్దతుగా నిలుస్తాం. ఇదేమయినా వైరుధ్యంగల అంశమా? రెండు రకాల పరిస్థితులలో మహిళలకు మేం ఎందుకు మద్దతు ఇచ్చామో వివరిస్తాను.
నిరసనలకు, సమస్యలకు రాజకీయ నేపథ్యం ఉంటుంది. ఏ పరిస్థితులు, రాజకీయాలు ఈ నిరసనలకు కారణమయ్యాయి? బయటికి రెండు చోట్లా నిరసనలకు కారణం హిజాబ్‌గా కనిపిస్తున్నా రెండు విషయాల్లో అసలైన కారణం-మహిళకు ఆమె ఏం ధరించాలో, ఎవరితో సన్నిహితంగా ఉండాలో, ఎవరిని ఆమె జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలో వగైరాలు నిర్ణయించుకునే హక్కు ఉందా అనేదే. ఒక్కొక్కసారి మౌలికంగా బద్ధవిరుద్ధమైన శక్తులు, ఏదయినా ఒక విషయంపై ఒకే వైఖరిని అవలంభించవచ్చు. కానీ వాటికి ఉపయోగించవలసింది ఒకే కొలబద్ద. అది మహిళల స్వతంత్రత, ఎంపిక హక్కును సమర్ధిస్తున్నదా? వ్యతిరేకిస్తున్నదా?
పెట్టుబడిదారీ, భూస్వామ్య సమాజాలలో సాధారణంగా 'ఎంపిక' అన్నది సాపేక్షికమే. పెట్టుబడిదారీ ప్రపంచంలో సంస్కృతి వర్గ వాస్తవాలను ప్రతిబింబిస్తుంటుంది. ఒక శ్రామిక మహిళ గాని, నిరుద్యోగ యువకుడు గాని ఉన్న సామాజిక ఆర్థిక అసమానతల దృష్ట్యా, ఇతర కారణాల రీత్యా, వాస్తవానికి తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోలేరు. అంతమాత్రం చేత స్వేచ్ఛ, స్వతంత్రతలకు సంబంధించిన చట్టాలు చేయడానికి, చిత్రాలు రూపొందించడానికి, ఇందుకవసరమైన సామాజిక వ్యవస్థ నిర్మించడానికి, అవసరమైన పోరాటాలు నిర్మించడానికి అభ్యంతరాలు ఉండవు. కుల వ్యవస్థలతో నిండిన భారత సమాజాలలో, గత దశాబ్ద కాలంగా రాజ్యం మెజారిటీ మతస్థుల సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో ''స్వయం ప్రతిపత్తి, ఎంపిక'' అన్నవి కుల, మత మధ్యవర్తిత్వంతో ఏర్పడ్డ రాజకీయాల మధ్య నలిగిపోతుంటాయి. ఎంపిక, హక్కులు, స్వేచ్ఛ మతమౌఢ్య పాలనల కింద చిదిగి పోతుంటాయి. ఇరాన్‌ అయినా భారతదేశంలో అయినా ఎక్కడికక్కడ పరిమితులు విధించే చరిత్రగల సమాజాలున్న ఈనాటి పరిస్థితికి, మహిళల స్థితికి సంబంధం ఉంది.
ఇరాన్‌లో 'హిజాబ్‌'...మహిళలు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి సంకేతం. ఇరాన్‌ సమాజంలో ఇరానియన్‌ లే కాక ఖుర్దిష్‌ జాతివారు, గిరిజనులు, ఇతరులు కూడా ఉంటారు. వారికి వారి వారి సంస్కృతులు ఉన్నాయి. ఖుర్దిష్‌ ప్రజలు స్వయంప్రతిపత్తి కోసం చేస్తున్న పోరాట ప్రభావం కూడా మహిళల పోరాటంపై ఉన్నది. 1930ల వరకు ఇరాన్‌ ప్రత్యేకమైన వస్త్రధారణకు సంబంధించిన నియమనిబంధలు లేవు. రెజా షా పాలన వచ్చిన తరువాత పశ్చిమ దేశాల సంస్కృతుల ప్రభావం భాషపై, వస్త్రధారణపై, ఇంకా అనేక ఇతర రంగాలపై పడింది. ముప్పైలలో హిజాబ్‌ ధరించడంపై నిషేధం విధించడం జరిగింది. హిజాబ్‌ ధరించిన వారెవరైనా శిక్షార్హులు. ఆనాడు ఎవరైనా హిజాబ్‌ ధరిస్తే రక్షక దళాలు వాటిని బలవంతంగా తొలగించాలని ఆదేశించారు. మగవారు టోపీలు తప్పనిసరిగా ధరించాలి. నిజానికి ఆనాడు పొలాలలో పనిచేస్తున్న అనేకమంది మహిళలు హిజాబ్‌ ధరించేవారు కాదు. హిజాబ్‌ సాధారణంగా పట్టణాలలో నివసించే ఉన్నత తరగతుల మహిళలు మాత్రమే ధరించేవారు. హిజాబ్‌లను బలవంతంగా తొలగించడం మొదలు పెట్టిన తరువాత, అందుకు వ్యతిరేకంగా హిజాబ్‌ ధరించేవారి సంఖ్య పెరిగింది. 1941లో పదవీచ్యుతుడైన పాలకుడి స్థానంలో మొహమ్మద్‌ రెజా షా వచ్చాడు. హిజాబ్‌ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేశాడు. అప్పడు హిజాబ్‌ ధరించడం దాదాపు మహిళల ఎంపికగా మారింది. షా పాలన అంతమైన తరువాత పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. మరింత ప్రజాస్వామ్య పాలన, పౌర హక్కులు, పౌర స్వేచ్ఛ Ûకోసం రెజా షా కి వ్యతిరేకంగా ఉద్యమం నడిచినప్పటికీ, పోరాటం అంతమయ్యే నాటికి అధికారం మత పెద్దల చేతుల్లోకి పోయింది. ఇస్లాం మతం పేరు మీద అత్యంత నియంతృత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హిజాబ్‌ తప్పనిసరిగా ధరించాలన్న నియమం అమలులోకి వచ్చింది. మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయడంతో తాత్కాలికంగా ఆ నియమం అమలుకాకుండా నిలిపివేశారు. అయితే, 1983లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానాలు, 74 కొరడా దెబ్బలు విధించబడతాయని చట్టంలో చేర్చారు. మహిళలు తమకు నచ్చిన వస్త్రధారణ కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది మహిళలు ఈ పోరాటంలో తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. వందలాది మంది ఖైదు చేయబడ్డారు. వందల్లో దేశం విడిచిపోవలసి వచ్చింది. ఈ పోరాటం చేసింది అత్యంత సాహసోపేతమైన మహిళలు. హిజాబ్‌ను కాల్చడం ఆ పోరాట గుర్తు మాత్రమే.
భారత్‌లో, కర్ణాటకలో ఈ మధ్య జరిగిన సంఘటనలను చూద్దాం. ఇక్కడ ఏ జాతికీ ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం ఏనాడూ లేదు. సిక్కులకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని రాజ్యాంగం గుర్తించింది. ఉదాహరణకు కత్తిని ధరించడం. చాలామంది సిక్కులు తలపాగా కట్టుకుంటారు. స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకున్న వారు కూడా తలపాగాలు కట్టుకుంటారు. దానిని బేధాలు వ్యక్తపరిచే అంశంగా ఎవరూ చూడలేదు. అయితే, మెజారిటీ మతతత్వవాదుల రాజకీయాలు పెరిగిపోవడంతో ఈ మధ్య బిజెపి పాలిత రాష్ట్రాలలో తమ మతతత్వ రాజకీయ ఎజెండాని ముందుకు తీసుకెళ్లడానికి మత గుర్తులను ఉపయోగించడం జరుగుతున్నది. అందువలన ముస్లిం మత ఛాందసులు కూడా ముస్లిం మహిళలపై తమ సంప్రదాయాలను వ్యక్తీకరించే గుర్తులను ధరించవలసిందేనని ఒత్తిడి చేస్తున్నారు. అందువలనే అనేకమంది ముస్లిం మహిళలు హిజాబ్‌లు వేసుకుంటున్నారు. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా చిన్న చిన్న పిల్లలు కూడా తలని కప్పుకుని వెళుతున్నారు. మతఛాందసుల ఒత్తిడి ఇందులో ఉన్నదనడంలో ఎటువంటి సందేహంలేదు. అయితే, భారతదేశంలో ముస్లిం మహిళలు, ఒక వైపు ఏ మాత్రం మార్పులను స్వాగతించలేని, తమ మత ఛాందసులు ఒత్తిడికి గురవుతుండగా... వేరొకవైపు హిందూ మతతత్వవాదుల ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తున్నది. ముస్లిం మహిళలు ఎంతో ధైర్యంగా చేస్తున్న ఈ పోరాటానికి ప్రజాతంత్రవాదులు మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. కానీ రానురాను ఈ పోరాటం కష్టతరమవుతున్నది. అటువంటి పరిస్థితులలో కర్ణాటక ప్రభుత్వం హిజాబ్‌ వేసుకుని కాలేజీలకు రాకూడదని ఆంక్షలు విధించింది. వివరాలు అందరికి తెలిసినవే. అయితే కర్ణాటకలో బడి యూనిఫామ్‌ వేసుకున్నప్పుడు అందులో భాగం కాని హిజాబ్‌ వేసుకోడాన్ని నిషేధించడం తప్పు కాదనే వాదనకి సమాధానం చెప్పాల్సి ఉంది. నిజానికి ఇది పూర్తిగా తప్పుడు వాదన. తరగతి గదులలోకి ఎవరూ హిజాబ్‌ ధరించి గాని, మొఖాలు కప్పుకుని గాని వెళ్లడం లేదు. తలలకు కేవలం స్కార్ఫ్‌ కట్టుకుని మాత్రమే వెళుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం దీనిని నిషేధించడానికి గల కారణం కేవలం రాజకీయాలే. రాబోయే ఎన్నికలలో తన మతతత్వ భావనలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పన్నిన పన్నాగమే. పక్కనున్న కేరళలో ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ముస్లిం ఆడపిల్లలు తమ యూనిఫామ్‌తో పాటుగా హిజాబ్‌ వేసుకుని బడులకు వెళుతున్నారు. కొందరు తమ యూనిఫామ్‌కి సరిపడిన రంగుల హిజాబ్‌ వేసుకుంటున్నారు. మతం పేరుతో బడిపిల్లలను విడదీయడం లేదు. పిల్లలందరు కలిసి చదువుకుంటున్నారు. కలిసి పరీక్షలు రాస్తున్నారు. మరప్పుడు కర్ణాటకలో ముస్లిం బాలికలు హిజాబ్‌ వేసుకుని విద్యాసంస్థలకు వెళ్తామంటే మద్దతునివ్వాలా వద్దా? వాళ్ళ మతం నమ్మకం ఆధారంగా వేసుకునే వస్త్రధారణని అడ్డుకునే హక్కు మనకుందా? ఇస్లాం మతంలో హిజాబ్‌ వేసుకోవాలన్న నియమం ఉందా అంటే, కొన్ని ముస్లిం దేశాలలో, సౌదీ అరేబియా వంటి దేశాలలో, అమ్మాయిలు హిజాబ్‌ వేసుకుని తీరాలనే నియమంలేదు. కొన్ని దేశాలలో తప్పనిసరి. ఏ మహిళ అయినా తన విద్యా హక్కును కేవలం హిజాబ్‌ కోసం ఎందుకు వదులుకోవాలి? ఇది మన దేశంలో చట్ట విరుద్ధమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. దీనిని నేను అణచివేతకు చిహ్నంగా చూస్తున్నానా లేదా అన్నది వేరే విషయం. రాజ్యం అమ్మాయిలను హిజాబ్‌ వేసుకుని బడులకు రాకూడదని నిర్దేశించడం సరైనదేనా అన్నదే అసలైన ప్రశ్న. ఇది అమ్మాయిల ప్రాథమిక హక్కులైన... చైతన్యం పొందే హక్కును, దానితో సంబంధంగల విద్యా హక్కును, వ్యక్తిగత ఎంపిక హక్కును హరించడమే.
రెండు దేశాలలో ఉన్న మహిళలు, ఆయా దేశాలలో మెజారిటీగా ఉన్న మతతత్వవాదుల చేతులలో పావులుగా ఉన్నారు. చారిత్రికంగా మహిళలు 'జాతి గౌరవాన్ని' నిలిపే వారుగా చూడబడతారు. వేషధారణలో, అలవాట్లలో, లైంగిక కోర్కెలను నియంత్రించుకోడంలో విధేయులుగా ఉండే వారిగా చూడబడతారు. అలా ఒదిగి ఉండకపోతే కఠినమైన శిక్షలకు గురవుతుంటారు. ఇరాన్‌ను పాలిస్తున్న మతవాదులు, మతం పేరుతో ఒక నిబంధనను అక్కడి మహిళలపై విధించారు. భారతదేశంలో మెజారిటీ మతస్థుల మత గ్రంథమైన మనుధర్మ శాస్త్రాన్ని ఇక్కడి మహిళలపై రుద్దాలని చూస్తున్నారు. యువతీ యువకులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఈ విధమైన జోక్యాన్ని మనం చూస్తున్నాము. ఇతర మతాల/కులాల వారిని వివాహం చేసుకుంటే 'గౌరవం' పేరిట దురహంకార హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ఇటువంటిదే మరో ఆట మొదలు పెట్టారు.
మెజారిటీ మతస్థులు, వారికున్న అధికారాన్ని ఉపయోగించుకోడాన్ని సమర్ధించుకోడానికి మహిళను పావుగా వాడుకుంటున్నారు. ఆమెను అవమానపరిస్తే జాతిని అవమాన పరిచినట్టుగా చిత్రిస్తున్నారు. ఏ సమాజంలో అయినా మహిళల గౌరవాన్ని కాపాడడానికే ఆమెపై నియంత్రణలు విధిస్తున్నామని అంటే...అవి కేవలం ఆమె ప్రజాతంత్ర హక్కులను కాలరాయడానికేనని అర్ధం చేసుకోవాలి. 'గౌరవం' అని వారు చెపుతున్నది కేవలం మోసపూరితమైన మాటలే. ఒక్క నియంతృత్వ సమాజంలోనే మహిళ జాతి గౌరవానికి ప్రతీకగా చూపబడుతుంటుంది. అందువలన దానిని తిరస్కరించాలి. అది ఇరాన్‌ అయినా. భారతదేశంలో అయినా. అందువలన మేము ఇరాన్‌ మహిళకు మద్దతునిస్తామని పునరుద్ఘాటిస్తున్నాను. హిజాబ్‌ వేసుకోడానికి పోరాటం చేస్తున్న కర్ణాటక లోని మహిళకు కూడా అందుకే మద్దతు తెలుపుతున్నాము.
వస్త్రధారణ ఆమె హక్కు... పూర్తిగా ఆ మహిళ హక్కు.

right to dressing women rights article brinda karat

 

 

 

 


/వ్యాసకర్త - బృందా కరత్‌, సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు