Mar 19,2023 13:43

ముంబయి   :   కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వ్యాఖ్యలపై శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే ) నేత సంజయ్  రౌత్‌ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది రిటైర్జ్‌ జడ్జీలు యాంటి ఇండియా గ్యాంగ్‌లో భాగమని కిరణ్‌ రిజిజు వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయమూర్తులను బెదిరించేందుకు ప్రయత్నమని అన్నారు. న్యాయవ్యవస్థను బెదిరించడం న్యాయమంత్రికి సరికాదని.. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమని అన్నారు. ప్రభుత్వానికి తలవంచడానికి నిరాకరించే న్యాయమూర్తులకు ఇది ముప్పు అని, న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని లోక్‌సభ నుండి సస్పెండ్‌ చేసే ఎత్తుగడ జరుగుతోందని అన్నారు. రాహుల్‌గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలని నిలదీశారు.  వాస్తవానికి బిజెపి నేతలు  విదేశీ గడ్డపై దేశానికి, రాజకీయ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు.   కొంతమంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు మరియు భారత వ్యతిరేక ముఠాలో భాగమైన కొంతమంది కార్యకర్తలు భారత న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించేలా చేస్తున్నారని శనివారం రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో రిజిజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.