Aug 09,2022 20:59
  • మత సామరస్యానికి ప్రతీక - తొలిరోజు భారీగా తరలచ్చిన యాత్రికులు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ నెల్లూరులోని భారాషాహిద్‌ దర్గామిట్ట ప్రాంగణంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజులపాటు జరగనున్న ఈ పండుగకు మతాలకు అతీతంగా తొలిరోజు ముస్లిములు, హిందువులు, అన్ని మతాల వారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొహరం కావడంతో పాకిస్తాన్‌, అప్ఘనిస్తాన్‌, కువైట్‌, దుబాయ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఎపితోపాటు దేశం నలుమూలల నుంచి భారీగా తరలస్తున్నారు. యాత్రికులతో దర్గామిట్ట ప్రాంతమంతా నిండిపోయింది. చదువు, వైద్యం, ఉద్యోగం, వివాహం, నివాసం తదితర కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన యాత్రికులు ఈ కేంద్రాల్లో తమకు కావాల్సిన రొట్టెలను అందుకున్నారు. అక్కడ ఉన్న దర్గాను దర్శించుకున్నారు. భారీగా జనం రావడంతో పొదలకూరు రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు 2173 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎస్‌పి విజయారావు, కమిషనర్‌ డి.హరిత దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే యాత్రికుల వాహనాల కోసం పోలీసులు 25 ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. డోన్‌ కెమెరాలతో అణుఅణువూ పరిశీలిస్తున్నారు. మంచినీరు, పారిశుధ్యం, ఉచిత వైద్యశిబిరం, మరుగుదొడ్లు, ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అపరిశుభ్రం లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం గంథమహోత్సవం జరుగుతున్నందున మరింత భద్రత పెంచనున్నట్లు ఎస్‌పి తెలిపారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసు కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విజ్జప్తి మేరకు బారాషాహిద్‌ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసింది.