Jul 29,2022 12:43

వాషింగ్టన్‌ :  'జేమ్స్‌ బాండ్‌' పరిచయం అవసరం లేని పాత్ర. హాలీవుడ్‌లో వరుస సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. హాలీవుడ్‌లో జేమ్స్‌ బాండ్‌ పాత్రకి, టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌కి సంబంధం ఏమిటీ.. అంటే.. జేమ్స్‌బాండ్‌ పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జేమ్స్‌బాండ్‌ పాత్ర సృష్టికర్త చియో హౌదారి కోకర్‌ స్వయంగా రామ్‌ చరణ్‌ ఆ పాత్రకు అన్ని విధాలా అర్హుడని ట్వీట్‌ చేయడం గమనార్హం. 'నో టైమ్‌ టు డై'లో డానియల్‌ క్రేగ్‌ జేమ్స్‌ బాండ్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే డానియల్‌ తరవాత జేమ్స్‌ బాండ్‌ ఎవరు? అనేది హాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఇటీవల విడుదలైన రాజమౌళి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ ట్వీట్‌ చేశారు. జేమ్స్‌ బాండ్‌ పాత్రని సమర్థంగా పోషించగల సత్తా ఉన్న నటుల్లో రామ్‌ చరణ్‌ ఒకరని పేర్కొన్నారు. మరో ముగ్గురు నటుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు. సోపే దిరుసు, మాథ్యూ గూడే, డామన్‌ ఇద్రిస్‌ పేర్లని సూచించారు. ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. చియో ట్వీట్‌ చేసిన వెంటనే.. 'జేమ్స్‌ బాండ్‌ పాత్రకు చరణ్‌ అన్ని విధాలా అర్హుడు' అంటూ చరణ్‌ అభిమానులు రీ ట్వీట్లు చేస్తున్నారు.