Aug 08,2022 07:23

అంకారా: డాలర్‌కు ప్రత్యామ్నాయంగా రూబుల్స్‌లో వ్యాపారం సాగించే విషయమై రష్యా, టర్కీ ఒక అంగీకారానికి వచ్చాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ శనివారం నాడిక్కడ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఒక మెమోరాండంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యానికి రూబుల్స్‌ కరెన్సీని వినియోగించడం వల్ల ఉభయతారకంగా ఉంటుందని ఆయన అన్నారు. సోచిలో జరిగిన చర్చల్లో తమ ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని నిర్ణయించినట్లు టర్కీ నేత తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక రోడ్డు మ్యాప్‌ కూడా రూపొందించామని, రష్యా, టర్కీ మధ్య వాణిజ్యం 10వేల కోట్ల డాలర్లకు పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. వియత్నాం, అర్మేనియా, ఉజ్బెకిస్తాన్‌, బెలారస్‌, కజకిస్తాన్‌, కిర్గిజిస్తాన్‌, తజికిస్తాన్‌, సౌత్‌ ఒసేటియా దేశాలు రష్యాతో ఇప్పటికే రూబుల్స్‌లో వాణిజ్యం సాగిస్తున్నాయి.