Oct 28,2021 18:48

మహిళలకు చెక్కు రూపంలో రుణం అందజేస్తున్న కలెక్టర్‌, బ్యాంకర్లు

ప్రజాశక్తి-విజయనగరం : సామాన్య ప్రజలకు మరింత సుళువుగా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి కోరారు. అన్ని అర్హతలు ఉన్నవారికి, రుణమంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. నగరంలోని ఒక ప్రయివేటు కల్యాణ మండపంలో జిల్లా లీడ్‌బ్యాంకు, భారతీయ స్టేట్‌ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం రుణమేళా నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రుణం తీసుకొనే విధానం, బ్యాంకు కార్యకలాపాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అన్నారు.ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్నాయని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే, బ్యాంకుల సహకారం అవసరమని స్పష్టం చేశారు. బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగతంగా వినియోగించుకోకుండా, దాని ద్వారా ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు, జీవన విధానాన్ని మెరుగుపర్చుకునేందుకు కషి చేయాలని సూచించారు. ఎస్‌బిఐ డిజిఎం(అమరావతి) ఎ.వెంకటరామయ్య మాట్లాడుతూ, అర్హత ఉన్నవారందరికీ రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌బిఐ రీజనల్‌ మేనేజర్‌ డి.రాజారాం మోహనరావు మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న 25 బ్యాంకులు పలు పథకాల కింద సుమారు రూ.139.52కోట్ల రుణాలను లబ్దిదారులకు, కలెక్టర్‌ చేతులమీదుగా అందజేశాయి. వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్‌ సూర్యకుమారి తిలకించారు. ముందుగా బ్యాంకర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నాబార్డు డిడిఎం పి.హరీష్‌, ఎస్‌బిఐ డిజిఎం మన్మయ పండాబ్‌, యూనియన్‌ బ్యాంకు డిజిఎం పి.కష్ణయ్య, బ్యాంకు ఆఫ్‌ బరోడా ఆర్‌ఎం వైవిఎస్‌ కోటేశ్వర్రావు, ఎపిజివిబి ఆర్‌ఎం టిజి నాగేశ్వర్‌, ఎస్‌బిఐ ఆర్‌ఎం అబ్దుల్‌ హసీబ్‌ అమిర్‌, డిప్యుటీ వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ పట్నాయక్‌, డిసిసిబి సిఇఒ కె.జనార్ధన్‌, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ ఎం.అశోక్‌ కుమార్‌, ఎపిడి సావిత్రి, మెప్మా పీడీ బి.సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.