
అనంతపురం ప్రతినిధి : మెజార్టీ సాంస్కృతికవాదం దేశ సమగ్రతకు, మనుగడకు ప్రమాదకరమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పేర్కొన్నారు. సింగమనేని నారాయణ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం స్థానిక లలితకళా పరిషత్ హాలులో 'సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సవాళ్లు-ప్రశ్నించే గొంతుకల అణచివేత' అన్న అంశంపై సింగమనేని నారాయణ స్మారక కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కమిటీ కన్వీనర్ ఎస్‌ఎం.బాషా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముందు సింగమనేని నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బివి.రాఘవులు ప్రసంగించారు. భారతదేశం భిన్నమైన సంస్క్కతులు, సంప్రదాయాలకు నిలయమని తెలిపారు. ఒకరి అభిప్రాయాలను, మరొకరు గౌరవించుకుంటూ భారత రాజ్యాంగానికి కట్టుబడి నడచుకునేది ప్రజా జతీయవాదం అవుతుందని పేర్కొన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మెజార్టీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అందరిపైనా రుద్దే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఇది ఆందోళనకరమైన అంశమన్నారు. ఒక మత విధానాలకు అనుగుణంగా తక్కిన అన్ని మతాల వారు అనుసరించాలన్న విధానం సరైంది కాదని పేర్కొన్నారు. అధికారంలోనున్న బిజెపి ఇదే రకంగా మతోన్మాద విధానాలను అమలు చేసేందుకు ప్రజల మధ్య విభజన తీసుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలను ప్రశ్నించే, వ్యతిరేకించే వారిపై నియంతృత్వాన్ని ప్రదర్శిస్తోందని చెప్పారు. ఈ విధానాలు ఇదే రకంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తూపోతే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లక తప్పదని హెచ్చరించారు. ప్రపంచ చరిత్ర ఇదే చెబుతోందని గుర్తు చేశారు. యుగోస్లేవియా, సోవియట్ యూనియన్ తదితర దేశాలు ఇదే రకంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మనువాద విధానాలు మైనార్టీ మతాలపై దాడే కాకుండా హిందూ మతంలోని మహిళల స్వేచ్ఛా హక్కులపై దాడి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. బిజెపి ఇప్పటికే 'గర్బ్ సంస్కార్' పేరుతో పెద్దఎత్తున ప్రచారాన్ని సాగిస్తోందన్నారు. మహిళ గర్బంతోనున్న సమయంలో పురాణాలు, ఇతిహాసాలు వినిపిస్తే సంస్కారవంతులైన పిల్లలు పుడతారని ప్రచారం చేస్తోందన్నారు. అలాగైతే వైద్యులు గర్బంతోనున్న మహిళలకు వైద్య విజ్ఞానాన్ని అందితే పుట్టకతో విజ్ఞానవంతులుగా పుడుతారా అని ప్రశ్నించారు. ఇలాంటి అశాస్త్రీయమైన విధానాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇంతగా సంస్కృతి గురించి మాట్లాడే బిజెపి ఈ ఏడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సాంస్కృతిక రంగానికి కేటాయించిన బడ్జెట్ కేవలం రూ.0.57 శాతం మాత్రమేనని చెప్పారు. అదే చైనాలో నాలుగు శాతం, యుఎస్‌ఎలో ఏడు శాతం కేటాయించడం జరిగిందన్నారు. దీనిపై పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తే విద్యా, వైద్యానికి కేటాయింపులు జరపాల్సి ఉన్నందున దీనికి తగ్గించాల్సి వచ్చిందని బిజెపి చెబుతోందన్నారు. ఆరంగాల కేటాయింపులు చూసినా నామ మాత్రంగానే నిధుల కేటాయింపులున్నాయని చెప్పారు. ఏది ఏమైనా ప్రజల మధ్య ఐక్యతను పెంచేటువంటి ప్రజా జాతీయవాదం చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, సింగమనేని స్మారక కమిటీ సభ్యులు డాక్టర్ ప్రసూన, సావిత్రి, సత్యబోసు, వి.రాంభూపాల్, నల్లప్ప పాల్గొన్నారు.