May 09,2022 07:38

   'కవులు తమలోంచి తాము (సబ్జెక్టివ్‌) రాయాలి. బయటి ఘటనల వర్ణనలు కవిత్వం కావు. మరెవరి కోసమూ కాకుండా తన కోసం తాను పాడుకునే పాటే కవిత్వం...' అంటారు కొందరు. 'కవిత్వంలో వస్తువే ముఖ్యం. సామాజిక ప్రయోజనమే నిర్ణాయకం. వస్తుగత (ఆబ్జెక్టివ్‌) విమర్శ మాత్రమే సరైన కవితా విమర్శ' అని మరికొందరంటారు. వీళ్లు... ఒకరి గురించి ఒకరు... తమ మధ్య పెద్ద శత్రు వైరుధ్యమేదో ఉన్నట్టు, అవతలి వారి గురించి పరుషంగా మాట్లాడుతుంటారు. సంగతేమిటంటే... అవి రెండూ పాక్షిక సత్యాలే! జరాసంధుని రెండు శరీర భాగాల వంటి వాదాలే. విముఖంగా ఉన్నంత వరకు రెండింటిలోనూ ప్రాణం ఉండదు. అభిముఖం కాగానే ప్రాణవంతమై కలిసిపోతాయి. జరాసంధుడు లేచి భీమసేనుడిని సవాలు చేస్తాడు. కవిత్వం కవికి స్వీయ మానసిక విశేషమే, అదే సమయంలో కవి స్పందన పొందేది వస్తుమయ ప్రపంచం నుంచే. వస్తుమయ ప్రపంచంలో కవి కూడా ఒక వస్తువు. అలాంటి కవిలోంచి పుట్టే గుండెపాట కవిత్వం. 'పర్సన్‌'గా కాదు, 'సోషల్‌ పర్సన్‌'గా కవి పాడే పాట కవిత్వం. ఇంకా చెప్పాలంటే కవి తనలోనికి ఆవాహన చేసుకున్న బాహిర జగత్తు తిరిగి కవి మనస్సులోంచి అతడి మాటై దూసుకు రావడం కవిత్వం.
 

                                                     కవిత్వం ఒకేసారి ఆబ్జెక్టివూ, సబ్జెక్టివు కూడా..

'నన్ను నేను తవ్వుకుంటున్నాను' అనే మాటను రకరకాల రూపాల్లో కవిత్వంలో తరచు వింటాం. ఈ మాట ఎన్నిసార్లు విన్నా, విన్న ప్రతిసారీ ఒక అనిర్వచనీయ సంజ్ఞ ఏదో మనలో నిద్ర లేస్తుంది. ఒకసారి మెత్తగా ఒకసారి గరుగ్గా లోపల పాకుతుంది.
అలా ఎందుకు జరుగుతుంది? ఆ మాట చెప్పింది ఎవరైనా, అది మన మాటే అనిపిస్తుంది. మన నుంచి అతడు కొట్టేశాడనిపిస్తుంది లేదా, మన మాటనే అతడెవరో చాలా బాగా చెప్పాడే అని మెచ్చుకో బుద్ధవుతుంది. ఎందుకు?
ఎందుకంటే ప్రతి మనిషీ తనను తాను తవ్వుకుంటూనే ఉంటాడు. అతడలా తనను తాను తవ్వుకోడం ఎందుకు? 'తనతనం' కోసమే. ఇతర్లను తవ్వి చూస్తున్నట్టు అనిపించినా, ఇతర్ల అంతరంగాల్ని వర్ణిస్తున్నట్లు అనిపించినా... అప్పుడు కూడా... అంతే. అతడు చేసేది ఇతర్లలోని తనను చూసుకునే ప్రయత్నమే.
ఈ భూగోళం మీదికి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వెళ్లిపోక తప్పదు కదా, మరి, ఎక్కడికి వెళ్తాను... అనేవి మనకు చాలా ఇష్టమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నల చుట్టూ చేసే తత్వవేత్తల, మత గురువుల, బాబాల ప్రవచనాలు, చివరికి సైన్సు ఫిక్షన్‌ కథలు కూడా చాల బాగా అమ్ముడవుతాయి. ఎందుకు? ఆ వక్త మనకంటె ఏదో తెలిసినవాడని నమ్మేసి, చెవులు బోడగించి వింటాం, ఎందుకు?
ఆ వక్త లేదా ప్రవక్త వద్ద కూడా మన ప్రశ్నలకు సమాధానం లేదు. వాళ్లు నిజంగా జవాబు తెలిసి మాట్లాడి ఉంటే, వారిలో ఎవరో ఒకరి ప్రవచనం ఆఖరి మాట అయ్యేది. ఏదో ఒక మతం లేదా శాస్త్ర సూత్రం ఆఖరి మాట అయ్యేది. మతాల పేరిట, సంస్క ృతుల పేరిట ఇన్నిన్ని కొట్లాటలు, మారణహౌమాలు జరిగేవి కావు. వాళ్ళకూ తెలీదు కాబట్టి, ఒకరు చెప్పిందాన్ని మరొకరు చాల వీజీగా పరాస్తం చేయగల్రు కాబట్టి... కాబట్టే... ఇన్ని కత్తుల కోలాటాలు. ఇదొక ఎడతెగని ప్రశ్న. జవాబు లేదని తెలిసీ అన్వేషణ ఆగని ప్రశ్న.
ఈ అన్వేషణాసక్తికి మూలకందం 'నేను'. 'నన్ను నేను' తెలుసుకోవాలనే తపన. 'నన్ను' అంటే నా శరీరాన్ని మాత్రమే కాదు, దాని లోపలా బయటా ఉన్న చరాచర వస్తుజాలాన్ని, వస్తుజాలంతో 'నాకు' ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలనే తపన. ఆ 'సంబంధాన్ని'... ఆ అనుబంధాన్ని కనుక్కోడం కోసమే... తవ్వుకుంటాం... తవ్వుకుంటాం... మనల్ని మనం, ఒకసారి చిద్రుపలు చిద్రుపలు అవుతూ ఒకసారి నెత్తురు నెత్తురవుతూ.
'కాగ్నిషన్‌' అనే ఇంగ్లీషు మాటకు ఈ 'తెలుసుకోడం' అనే పదం మంచి తెలుగే అనుకుంటాను. కాగ్నిషన్‌ లేదా తెలుసుకోడం కోసం... చరాచర ప్రపంచం లోపల తనను తాను తెలుసుకోడం కోసం... ఓV్‌ా, మనిషి వద్ద ఎన్నెన్ని పరికరాలో. క్రతువులు, మతాలు, తత్వశాస్త్రం, పురాణాలు (మిత్‌), వాదాలు, తర్కం, సైన్సు... అన్నీ మనల్ని మనం తెలుసుకోడానికి మనం ఉపయోగించే పరికరాలే.
ఇంతవరకు నా మాటలకు అందరూ ఓకే అంటారు. కవిత్వం కూడా అలాంటి ఒక పరికరమేనంటే అబ్బే, అదెట్టా అంటారు. కవిత్వం మీద ఉన్న అతి అంచనాలూ అల్ప అంచనాలే... ఈ అనవసర ఆశ్చర్యానికి కారణం. సైన్సు లాగే, మతం లాగే, తత్వశాస్త్రం లాగే, పురాణం లాగే... కవిత్వం కూడా ఒక తవ్వుకోల. అంతే. అంతకన్న తక్కువా కాదు, అంతకన్న ఎక్కువా కాదు.
కంటికి కనిపిస్తూనే, (బహుశా) ఎప్పటికీ మన చేతికి అందని నక్షత్రాల్లో, కాళ్ళ కింద పాతాళంలో మరిగే శిలాద్రవం (మాగ్మా)లో.... సైంటిస్టులు ఒక విధంగా అన్వేషణ చేస్తే, ఆ అన్వేషణనే కవి మరో విధంగా చేస్తాడు. అందుకే, చాల సార్లు కవి ఊహలు విజ్ఞానశాస్త్ర శోధనకు ప్రేరణ అవుతుంటాయి. వైస్‌ వెర్సా. అందువల్ల కవిత్వం (కూడా) ఒక తవ్వుకోల. ఈ తవ్వుకోల కవినీ, సమాజాన్నీ ఒకేసారి తవ్వుతుంది. కవిది ఒకే సారి వస్తుగత (ఆబ్జెక్టివ్‌) దృష్టీ , స్వీయ మానసిక (సబ్జెక్టివ్‌) దృష్టి కూడా.
నాకూ నీకూ, నాకూ ప్రపంచానికి మధ్య రేఖ చెరిగిపోయే సందర్భం కవిత్వం. దీనికి ఒక మంచి ఉదాహరణ : వంగవీటి రంగా హత్య తరువాత జరిగిన విధ్వంసంలో, విజయవాడ ఏలూరు రోడ్డులో పడి ఉన్న ఒక శవాన్ని చూస్తూ... కవి అజంతా, ఆ శవంలో తనను తాను చూసుకుంటాడు. ఆ శవం అజంతాకు ఒక కవితా వస్తువు (ఆబ్జెక్ట్‌) మాత్రమే కాదు. అది కవి మనస్సు (సబ్జెక్టివ్‌) కూడా. తానే అది, అదే తను.
ఇలా కవీ- ప్రపంచం, ఆబ్జెక్ట్‌- సబ్జెక్ట్‌ ఒకటే అయిపోయే స్థితికి అద్దం పట్టే కవితల సంపుటి 'సాహితీ మిత్రులు' ప్రచురిస్తున్న 'కవిత- 2021'. ఇవన్నీ 2021లో (లేదా ఆ ప్రాంతాల్లో) రాశారని చెప్పడానికి ప్రతి కవితలోనూ సాక్ష్యం దొరుకుతుంది.
ఈ పుస్తకానికి తలమానికం అనదగిన వై.కరుణాకర్‌ కవితను సబ్జెక్ట్‌ ఆబ్జెక్ట్‌ అభేదానికి మరో మంచి ఉదాహరణగా చూపించొచ్చు. కరోనా కాలం మనకు బతుకంతా గుర్తుండిపోతుంది. దానిలో వలస కార్మికుల దు:ఖం మన వ్యవస్థ క్రూరత్వానికి చెరగని సంకేతంగా నిలిచిపోతుంది. ఆ నొప్పిని పఠిత గుండెమీద ముద్రించిన కవిత 'వాళ్ళు'. కవి, వై.కరుణాకర్‌ వీల్‌ ఛేర్‌ బంధితుడు. వికలాంగుడు. అలాంటి మనిషి నడవడం గురించి చేసే ఊహలు ఎట్టా ఉంటాయో సులువుగా ఊహించుకోవచ్చు. నడక అనేది మనలో చాల మందికి చాల సాధారణమైన చర్య. మనకు అదొక విశేషమే కాదు. కరుణాకర్‌ లాంటి వాళ్ళకు అది మహా విశేషం, చాల గొప్ప అనిపిస్తుంది. వాళ్లు తమకు కాళ్ళు వస్తే ఎలా నడిచి ఆనందిస్తారో కలలు గంటారు.
కరోనా సమయంలో వలస కార్మికులు... వాళ్ళను కొత్త చోట్లలో ఉండనీయక, సొంతూరికి వెళ్లే సౌకర్యాలూ లేక మైళ్ళకు మైళ్లు రోడ్ల మీద నడిచిపోయారు. ఆ పెయిన్‌ను కరుణాకర్‌ తన స్వీయమనస్కత నుంచి మొదలెట్టి క్రమంగా వస్తుగతం చేస్తూ చెప్పిన తీరు మీరు చూసి తీరాలి. చదివి తీరాలి.
''నేనెప్పుడూ నడవలేదు/ నడవడం ఎట్లా ఉంటుందా అని/ రకరకాలుగా ఊహిస్తుంటాను/ ఒంటరిగానో జంటగానో గుంపులుగానో/ చేతులు కట్టుకునో చేతులు పట్టుకునో/ నడుస్తున్నవారిని చూడడం/ నాకత్యంత మనోహర దృశ్యం/ ..... ఇప్పుడు దేశమంతటా/ అనేక దిక్కులలో/ ఎడతెరిపి లేకుండా/ ముసలి వాళ్ళు పసివాళ్లు/ నిండు చూలాళ్లు పచ్చి బాలింతలు/ నడుస్తూ ఉంటే/ నడవాలనే కలను/ చెరిపెయ్యాలని ఉంది''
కరోనా వలస కార్మికుల దు:ఖం 2021 కాలానికి ప్రత్యేకం. అంతకు ముందు, ఆ తరువాత కూడా కరోనా కాలమంత తీవ్రంగా లేదు గాని, అది ఎప్పుడూ ఉంది. మొత్తంగా ఆధునిక జీవితం... కరోనా ఉన్నా లేకున్నా పరమ కరుణ రహితంగానే ఉంది. మన చుట్టూ చిన్న పెద్ద అరణ్యాల్ని, అరణ్యపుత్రులనూ హతమార్చి నిర్మించిన కాంక్రీట్‌ అరణ్యాలలో మన ఆత్మలు ఘోషిస్తూనే ఉన్నాయి. ఈ ఇరుకు నుంచి కాస్త వెసులుబాటు కావాలని అలమటిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఊపిరాడని సందర్భాలను కూడా ఈ ఏడాది కవులు మరువరాని రీతిలో అక్షరం చేశారు.
''నా కోసం ఓ చిన్న త్యాగం చేస్తారా?/ నాకో ఊపిరి ముక్కను దానంగా ఇస్తారా'' అని అడుగుతాడొక కవితలో మన కాలపు వామనుడు, మానవుడు. ('ఊపిరి మొలక', ఈతకోట సుబ్బారావు). బహుశా, మానవ నాగరికత మొదలైనప్పుడు మొదలై ఇప్పటికీ వదలని జాడ్యం పురుషాహంకారం. 'ఆడవాళ్లూ! మీరు పురుషాహంకారం గురించి మాట్లాడకండి, అది శత్రుపూరితం, మీరు పువ్వుల గురించి, ప్రేమల గురించి మాత్రమే చెప్పండి' అని హుకుం జారీ చేస్తే... ఇక మనసున్న స్త్రీలెవరూ కవిత్వం రాయలేరు. పురుషులు రాసిన వాటినే వల్లె వేస్తూ కూర్చుంటారు. ఏనాడు కుటుంబం పుట్టిందో ఆనాడే స్త్రీల మార్జినలైజేషన్‌ మొదలైందని మోర్గాన్‌, మార్క్‌ ్స ససాక్ష్యంగా నిరూపించారు. అంతే కాదు; ఏనాడు కుటుంబం పుట్టిందో ఆనాడే స్త్రీల అణిచివేతతో పాటు మనిషి మీద మనిషి అణిచివేత కూడా పుట్టింది. కుటుంబానికీ, రాజ్యానికీ ఉన్న సహౌదర సంబంధమది. అవి రెండూ వైదొలకుండా... ఇంకెన్ని కబుర్లు చెప్పినా... అణిచివేత అనేది ఎప్పటికీ వదలదు. కుటుంబం, రాజ్యం అనుబంధాన్ని మునుపటిలాగే ఈ పుస్తకంలో ఇప్పటి స్త్రీలు కూడా చెప్పారు. కాకపోతే కాసింత కొత్తగా, సైన్సుకు సాహిత్యానికి మధ్య రేఖ చెరిగిపోయేలా చెప్పారు. ''మా మనుగడనంతా ఆనువంశికతాక్రమణల/ కాలనాగుల నోటికి ముట్టజెప్పి/ అగ్రరాజ్యాలు ఇప్పుడు కొత్తగా/ అడుసు తొక్కుతున్నాయనడమే/ పెద్ద విడ్డూరం'' అంటారు వైష్ణవిశ్రీ ('అందమైన బాల్కనీ'). స్త్రీల మనుగడను... ఆనువంశికత అనే గుంజకు (కుటుంబానికి) కట్టేసి ఇక మీరు ఏ అగ్రరాజ్యాల అణిచివేత గురించో ఎలా మాట్లాడతారని కవయిత్రి ప్రశ్న. 'పర్సనల్‌ ఈజ్‌ పాలిటిక్స్‌' అనే మాటకు మంచి కవితా రూపం అనుకుంటానీ వాక్యం. మనందరం... ఇల్లు దాటి రచ్చబండ మీద చాల రాజకీయాలు మాట్లాడతాం. జెండాలెత్తుతాం. పిడికిళ్లెత్తుతాం. ఊరేగింపులు తీస్తాం. అవన్నీ చేయదగినవే, చేయాల్సినవే. కాని, ఏ అణిచివేతలు, ఆక్రమణల గురించి బయట మైకులు పగలగొడుతున్నామో ఆ అణిచివేతలు, ఆక్రమణలు మన ఇళ్లలోనే ఉన్నాయి. మన కుటుంబ వ్యవస్థలోనే ఉన్నాయి. ఇది గమనించారా అని మెత్తగా లెంపకాయ కొట్టి మరీ చెప్పారీ కవయిత్రి.
కుటుంబ వ్యవస్థ లోపల స్త్రీ విముక్తి ప్రధానంగా భర్త పెత్తనాన్ని వొదిలించుకోడం మీద ఆధారపడుతుంది. భర్త పెత్తనాన్ని వదిలించుకోడమంటే అమ్మలుగా పిల్లల బాధ్యతను వదులుకోడం కాదు. భర్త పెత్తనాన్ని వదులుకోడం మాత్రమే. పెత్తనం లేని ప్రేమను పొందాలనే స్త్రీ కోరిక మాత్రమే. దాచి చెప్పే కవితా గుణాన్ని వదులుకోకుండానే- తోడేలు ముఖపు కుటుంబ హింసను పరిచయం చేసి, దాన్నుంచి బయటపడడంతో ఏర్పడే ఖాళీని పాప మీద ప్రేమతో నింపుకోవడం ఎలా ఉంటుందో చెప్పారొక కవయిత్రి. ''ఆకాశంలో నీ రూపురేఖలతో మబ్బులు/ నోళ్లు తెరిచి నా వైపుకి అప్పుడప్పుడు దూసుకు వస్తాయి. ... ముప్పిరిగొన్న ఉన్మత్త ప్రేమలో పగలబడి నవ్వేసి పాపాయిని హత్తుకున్నాను/ మా కేరింతలకు చెదిరిపోయి/ ఆకాశంలో తోడేళ్లు నునులేత పువ్వులై విరిశాయి'' ('విముక్తి'... మమతా కొడిదెల). విముక్తి అనే ఈ కవిత శీర్షిక కూడా కవితలో భాగమైపోయింది. అంతవరకు అతడి జ్ఞాపకాలతో తోడేలు మొహాలై కనిపించిన మేఘాలు ప్రేమగా పాపను హత్తుకోగానే పువ్వులైపోవడం గొప్ప ఓదార్పు నిచ్చే ఊహ.
2021 కాలంలో మనుషులను కదిలించిన సంఘటనలకు స్పందిస్తూ రాసిన కవితలు ఈ సంపుటికి ఒక మంచి కాలనాళిక రూపమిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తన మత వివక్షా పథకాలకు అనుగుణంగా తలపెట్టిన పౌరసత్వ నిర్ధారణ చట్టం, వ్యవసాయానికి స్వేచ్ఛనిచ్చే పేరుతో సరికొత్త కార్పొరేట్‌ సంకెళ్లు తొడగాలని ఉద్దేశించిన వ్యవసాయోత్పత్తుల చట్టాలు... ఈ కాలంలో బాగా చర్చనీయమయ్యాయి, అపూర్వ రీతిలో ప్రజలు కదిలారు. ఇవన్నీ బాహిర విషయాలే. తెలుగు కవులు.... చాల ఎక్కువ మంది... ఈ చట్టాల బాధితులేం కాదు. అయినా ఈ బాహిర విషయాలు తమ అంతరంగ విశేషాలే అయినట్లు చిక్కని కవిత్వం చెప్పారు. దానికి ఈ సంపుటి వేదిక అయ్యింది. 'రెప్పకీ కంటికీ మధ్య నీటి ముల్లు' వంటి అబ్బురపరిచే మెటఫర్లతో (గంటేడ గౌరునాయుడు) ఈ కవులు పఠితల మనస్సులలో నిలిచిపోతారు.
కొద్దిమంది ధనదాహానికి సామాన్యులందరూ బలయ్యే దురవస్థే, మానవ జాతి మనుగడకు మూలమైన పర్యావరణం ధనవంతుల అత్యాశలకు బలవుతున్న దురవస్థే... మన కాలపు దు:ఖం సారాంశం. శ్రామికులూ, ప్రగతివాదుల తిరుగుబాట్ల వల్లనే చివరికి ఈ దు:ఖం తీరుతుంది. ఆ పోరాటం, పరిష్కారం... శ్రామికులకే కాదు, కార్పొరేట్‌ పెట్టుబడిదారులక్కూడా అవసరమని హెచ్చరిస్తాడొక కవి. 'ఉరేరు, నువ్వు కూడా చస్తావురోరు' అని వాడు వినక తప్పని వాడి భాషలోనే చెబుతాడు.
''నడి సంద్రం లోని నావ/ చిల్లు పడిన చివరి క్షణాన సైతం/ సైతాను దూతలా సందడి చేస్తున్న/ ధనదాహ, నిర్లజ్జ, వ్యాపార, వ్యామోహీ!/ మునిగిపోతున్న నావలో/ నువ్వూ మునిగిపోతున్న ముసాఫిర్‌ వే?'' ('మహా నిర్మాణ వేదిక', గాలోజు నాగభూషణం). పైకి వైరాగ్యం అనిపించినా నిజానికి ధనస్వాములకు గట్టి హెచ్చరిక వినిపించాడు ఈ బలమైన మాటలతో కవి.
ఎవరో విమర్శనాత్మకంగా అన్నట్లు కేవలం 'బర్నిగ్‌ ఇస్యూస్‌' మాత్రమే కాదు, కరోనా కర్కశాలే కాదు, రోజువారీ జీవితంలో ఆడపిల్లల ఆక్రందనలే కాదు... చిన్న చిన్న ఘటనలను, తమదైన రోజువారీ జీవితాన్ని కూడా 2021 కవులు కవిత్వీకరించారు. ''బహుశా నల్లని ఆకాశానికి/ నక్షత్రాలు అతికి చందమామను కుట్టింది మా అమ్మేనేమో'' అంటూ కుట్టు మిషన్‌తో కుటుంబాన్ని నడిపించే కన్నతల్లిని 'ఆకాశానికెత్తేశాడొ'క కవి, వావ్‌ అనిపించే మాటలతో. ('అమ్మా నేనూ కుట్టిమిషన్‌'... దొరబాబు మొఖమాట్ల).
ఇంతకు ముందులాగే, బహుశా ఇక ముందు చాల కాలం లాగే 2021లో మనం చాల దు:ఖం అనుభవించాం. దు:ఖపు వెయ్యికాళ్ళ జెర్రి దేశమంతటా పాకింది. ఒక రైల్వే స్టేషన్లో శవమై పడి ఉన్న తల్లిని పాల కోసం పైట వద్ద తడుముతున్న పసి వాడిని ఈ కాలంలో చూశాం. అయినా, 'నేను మహాకవిని కాను/ కానీ, అద్దంలోంచి వెలుతురు పడాలని/ కన్నీళ్ళు చిందిన కిటికీలను తుడుస్తాను' ('రాళ్లు విసిరే వాళ్లు'... ఆశారాజు) వంటి మాటలతో మన కనుల తడి తుడుచుకుంటూ, పడి లేచిన కెరటాలమై ముందుకు నడిచాం. ఈ దిగులులో మునిగితేలుతూ... ''కాసేపు పడుకో/ ఒక దోవ దొరుకుతుంది/ దుర్గమారణ్యంలో కూడా ఒక దోవ దొరుకుతుంది'' అన్న కవి వాక్కుతో ఒకింత సాంత్వన పొందాం. ('ఒక దోవ దొరుకుతుంది'... కె. శివారెడ్డి). 2021 కాలంలో మనందరి హృదయ చలనాలకు అద్దం పట్టిన కవిత్వం 'కవిత 2021'.
 

(సాహితీ మిత్రులు వెలువరించిన కవిత
2021కి అతిథి సంపాదకీయం)
- హెచ్చార్కె