
ప్రజాశక్తి- వంగర : సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. వంగర మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవలను పరిశీలించి, అసంతృప్తి వ్యక్తం చేశారు. సేవల సంఖ్యను పెంచాలని సూచించారు. సచివాలయం, ఆర్‌బికె తదితర ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. జగనన్న ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కాలనీలో రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. గ్రామంలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. గర్భిణులు, పిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించాలని, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి పోషకాహారం, అవసరమైన మందులను అందించాలని సూచించారు. ఆధార్ సేవలు, పంట రుణాలు, డ్రాపౌట్లు, పోషకాహార పంపిణీ, ప్రకృతి సేద్యం, ఇతర సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అన్ని గ్రామాల్లో చెత్తశుద్ధి కేంద్రాలను నిర్మించి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కుల ధృవీకరణ పత్రాలు అవసరమైన విద్యార్థులకు, జాప్యం చేయకుండా వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఐజాక్, ఎంపిడిఒ శ్రీనివాసరావు పాల్గొన్నారు.