Jul 29,2021 20:20

అంబటివలస సచివాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న జెసి వెంకటరావు

బొండపల్లి : సచివాలయ సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ ఈ వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలని జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) జె.వెంకటరావు సూచించారు. మండలంలోని అంటివలస సచివాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఇంటి ముంగిటకే పాలన తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దీన్ని విజయవంతం చేసే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందని అన్నారు. సమస్యలను సకాలంలోపరిష్కరిస్తూ మంచి సేవలు అందించినప్పుడే సచివాలయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. సచివాలయ ఉద్యోగిగా గ్రామీణ ప్రజలకు సేవలందించే అవకాశం కలిగినందుకు గర్వపడాలని పేర్కొన్నారు. పథకాల అమలు, ప్రజలకు సేవలందించడంపై ఆరా తీశారు. ఉద్యోగుల హాజరుపట్టికను తనిఖీచేశారు.
పార్వతీపురంరూరల్‌ : సబ్‌ కలెక్టర్‌ భావన కృష్ణపల్లి గ్రామ సచివాలయాన్ని, మున్సిపల్‌ పరిధిలో చర్చి వీధిలో గల వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అంతా తప్పకుండా అనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు. సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు.
పార్వతీపురం టౌన్‌ : సచివాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని, తమకు ఎవరూ బాధ్యులు లేరనే విధంగా పనిచేయడం మంచిదికాదని మున్సిపల్‌ కమిషనర్‌ పి.సింహాచలం సచివాలయ సిబ్బందికి సూచించారు. పట్టణంలోని 4వ వార్డు సచివాలయాన్ని కమిషనర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సర్వీసులు, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అందరూ ప్రభుత్వ విధి విధానాలు అర్ధం చేసుకొని ప్రజలకు సేవలందించాలని, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.
బొబ్బిలి : పట్టణంలోని గొల్లపల్లి పరిధిలో 10, 11, 12 వార్డుల సచివాలయాలను కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావుఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పింఛన్ల ఇకెవైసి పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో శానిటేషన్‌ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మురళి పాల్గొన్నారు.