Nov 02,2022 14:40

జైపూర్‌  :   రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌పైలెట్‌ల మధ్య వైరం కొనసాగుతోంది. పార్టీని ధిక్కరిస్తూ తిరుగుబాటు ప్రకటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సచిన్‌ పైలెట్‌ వ్యాఖ్యానించారు.  రాజస్థాన్‌లో అనిశ్చితికి ముగింపుపలకాల్సిందేనని స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా సచిన్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిశీలకులు కె.సి.వేణుగోపాల్‌ రాజస్థాన్‌లో పరిస్థితులను పరిశీలిస్తున్నారని, ఇది క్రమశిక్షణా రాహిత్యమని, ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారని, చర్యలు తప్పవని అన్నారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఎంత సీనియర్‌ అయినా రూల్స్‌ ఒకటేనని అన్నారు. రాజస్థాన్‌ పరిస్థితులపై కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే త్వరలో నిర్ణయం కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు.

గతంలో గెహ్లాట్‌ మద్దతుదారులు చూపిన ధిక్కారానికి సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పారని అన్నారు. రాజస్థాన్‌లో మంగళవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రి గెహ్లాట్‌ను సీనియర్‌ ముఖ్యమంత్రిగా పేర్కొంటూ ప్రశంసలు కురిపించారని, ఈ ప్రశంసలను తేలికగా తీసుకోకూడదని అన్నారు. గతంలో గులాం నబీ ఆజాద్‌ను మోడీ ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడారు.

ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక బరిలో అధిష్టానం గెహ్లాట్‌ను ప్రకటించగా.. అందుకు ఆయన అంగీకరించినా.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవి వీడేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి గెహ్లాట్‌ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలే కారణమని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుల బఅందం తేల్చడంతో సోనియాకు క్షమాపణలు చెప్పారు. 2020లో పైలట్‌ కూడా కొందరు ఎమ్మెల్యేలతో గెహ్లాట్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు.