Aug 17,2022 23:24

వర్క్‌షాపులో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు

  ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 షెడ్యూల్డ్‌ ఎంప్లాయీమెంట్స్‌లో కనీస వేతనాలు సవరిస్తూ జిఒ జారీ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు తక్కువ లేకుండా నిర్ణయించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌చేశారు. జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో కనీస వేతనాలపై బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 70 షెడ్యూల్డ్‌ పాంప్లాయీమెంట్స్‌లో 2007 సంవత్సరం నుంచి జిఒలు సవరించలేదన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఉన్న జీతాలను పెంచుతూ జిఒలు ఇవ్వాల్సి ఉండగా 2011, 2016, 2021 పూర్తయినా జిఒలు ఇవ్వకుండా కార్మికులను శ్రమను దోచుకోవడం దుర్మార్గమన్నారు. ఈ జిఒలు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులు కోట్లాది రూపాయలు నష్టపోయారన్నారు. కనీస వేతనాల జిఒలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడదని ఈ డబ్బులు యాజమాన్యాలు చెల్లిస్తాయని పేర్కొన్నారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ మాట్లాడుతూ, 2007 నుంచి 2022 వరకు మార్కెట్‌లో నిత్యావసర ధరలు, స్కూల్‌ ఫీజులు, ఇంటి అద్దెలు, విద్య, వైద్యం, గ్యాస్‌, రవాణా వంటి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. అయినప్పటికీ కార్మికులకు ఇస్తున్న కనీస వేతనాల జిఒలను సవరించకపోవడం అన్యాయమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలు మంది ఈ షెడ్యూల్డ్‌ ఎంప్లాయమెంట్స్‌లో పనిచేస్తున్నారని, విశాఖజిల్లాలో 2 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీరందరినీ ఐక్యం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో వివిధ సంఘాల నాయకులు బి.జగన్‌, జి.అప్పలరాజు, బి.వెంకటరావు, వి.కృష్ణారావు, ఎన్‌.నరేంద్రకుమార్‌, పి.మణి, పద్మ, తులసి, లక్ష్మణమూర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.