Dec 02,2021 06:52

శ్రీలంక వ్యవసాయ సంక్షోభ నేపథ్యంలో సేంద్రియ సేద్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల ఈ అంశాన్ని సైన్స్‌ పర్యావరణ ఉద్యమ సంస్ధ వారు తమ 'డౌన్‌ టు ఎర్త్‌' పత్రిక ద్వారా చర్చించగా, 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ది హిందూ' వ్యాసకర్తలు కూడా చర్చించారు. ఈ సేంద్రియ వ్యవసాయ సంస్కరణ శ్రీలంక ప్రభుత్వ అనాలోచిత చర్యగా వ్యవసాయ రంగ నిపుణుడు డా|| ధర్మకీర్తి (పెరడేనియా విశ్వవి ద్యాలయం-శ్రీలంక) వర్ణించారు. నిజంగా ఈ వ్యవసాయ విధానం వల్లే శ్రీలంకలో ఆహార సంక్షోభం వచ్చిందా? లేక వేరే ఇతర పాలనా రంగ లోపాల వల్ల జరిగిందా? అనే అంశం మీద కూడా ఆసక్తి నెలకొంది. వ్యవసాయ రసాయన కంపెనీలు, ప్రభుత్వ వ్యతిరేకులు ఈ పరిస్ధితిని పెద్దదిగా చేసి ప్రచారం చేస్తున్నారని కొందరంటే...ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్ల, అపరిపక్వ సంస్కరణాభిలాష వల్ల ఈ సంక్షోభం వచ్చిందని మరి కొందరు అంటున్నారు. ఈ పంట సంవత్సరంలో శ్రీలంక ప్రభుత్వం వ్యవసాయ రసాయనాల దిగుమతులను పూర్తిగా నిషేధించింది. ఆ దేశ సామాన్య వ్యవసాయదారులను ముఖ్యంగా 'వరి' వంటి మౌలిక ఆహార పంట, తేయాకు వంటి ముఖ్య వ్యాపార పంట సాగుదారులను ప్రభుత్వ సంస్కరణ ఇబ్బందుల్లోకి నెట్టింది. పైగా ప్రభుత్వ వ్యవసాయ శాఖ, పాలనా రంగ అధికారులు ప్రత్యామ్నాయ వ్యవసాయ వనరులను కల్పించకుండా, వాటి ప్రాధాన్యతను ప్రచారం చెయ్యకుండా, రసాయనాలు వాడకూడదని నియంత్రించడం రైతులను ఇబ్బందులకు గురి చేసినట్లు అర్ధమౌతున్నది. రసాయనాలకు ప్రత్యామ్నాయమైన జీవన, పచ్చి రొట్ట, కంపోస్టు, పశువుల ఎరువుల వంటి వాటిని అందుబాటు లోకి తేలేకపోవటం రైతులను నష్టపరచింది. అదేవిధంగా భారతదేశం నుండి దిగుమతి చేసుకొన్న ''ద్రవ నత్రజని'' ఎరువు విలువ వారికి తెలియలేదు. నిజానికి ఇఫ్‌కో (ఐఎఫ్‌ఎఫ్‌సిఓ) వారి ద్వారా రూపొందించబడ్డ ''నానో రాజా'' ఎరువు యూరియా వంటి ఎరువుల పొదుపు లేక అదుపులో ప్రయోజనకారి. అలానే చైనా నుండి దిగుమతి అవ్వాల్సిన జీవన ఎరువులు లోపభూయిష్టంగా వున్నాయని తిరస్కరించటం మరో నష్టదాయక పరిణామం. ఫలితంగా రైతులు రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. వరి పంట దిగుబడులు అనూహ్యంగా పడిపోవటం, దేశ ప్రజల ఆహార రంగ అందుబాటుకు నష్టకరంగా పరిణమించింది. వాస్తవానికి శ్రీలంక సహజ వనరులు, వ్యవసాయ వాతావరణం, జీవ వైవిధ్యం, కుటుంబ వ్యవసాయ విధానాలు అక్కడి ప్రజలకు పటిష్ట ఆహార భద్రత కల్పించగలిగాయి. శ్రీలంక వంటి దేశాల వరి వ్యవసాయం (తక్కువ వనరుల వినియోగం) చాలా దేశాలకు విస్తరించింది. ఆ దేశ వరి, తేయాకు పంటల పరిశోధనలు ఎందరినో ప్రభావితం చేశాయి. ఇక్కడ జరిగిన మార్పు-పూర్తిగా సేంద్రియ సాగు వైపు మరలి, వ్యవసాయ రసాయనాల దిగుమతులపై ఆంక్షలు విధించటం-రైతులను సమాయత్తం చేయకుండా జరిగిందని, సేంద్రియ పంటల సాగులో, ప్రారంభ దశలో పంట దిగుబడులు అంతగా పెరగవని తెలిసి కూడా ప్రభుత్వం మొండి పట్టుతో ఉందని తెలుస్తున్నది. శ్రీలంక వ్యవసాయ రంగ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే మనకు కొన్ని విషయాలు అర్ధమౌతున్నాయి.

 సేంద్రియ సేద్యం ప్రస్తుతం నడిచే రసాయనాల ఆధారిత (హరిత విప్లవం ద్వారా రూపొందిన విధానం) వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉండగలదా? వుంటే ఈ తరహా వ్యవసాయ విధానం ప్రపంచం మొత్తం మీద కేవలం 1.5 శాతం మంది రైతులే ఎందుకు చేస్తున్నారు? ఇది ఎందువల్ల విస్తరించటంలేదు? ప్రకృతి సేద్యం, సేంద్రియ సేద్యం ఒకటేనా? ''గాలిలో దీపం'' తాత్వికతకు నిదర్శనమైన ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ సేద్యంతో పొల్చవచ్చా?

 ప్రభుత్వ విధానాలు మారకుండా కేవలం పంటల సాగు విధానాలు మార్చితే సంక్షోభాలు ఆగిపోతాయా?

 కుటుంబ వ్యవసాయ విధానాలు లేని దేశాల్లో ఈ సేంద్రీయ సాగు పద్ధతులు అమలు చేయగలమా? భూ సంబంధాలు మారకుండా ఇది సాధ్యమేనా?

 సేంద్రియ/ప్రకృతి/రసాయనాలు లేని వ్యవసాయం వల్ల ఆహార (భద్రతకు) ఉత్పత్తులకు ముప్పు ఏర్పడుతుందా? వంటి అంశాలను మరోసారి చర్చించుకోవాల్సి వుంది.

20వ శతాబ్దపు సైన్స్‌-సాంకేతికాల వెలుగులో మార్చబ డిన భారత వ్యవసాయ రంగం, నిజానికి మనకు ఆహార భద్రత కలిగించిందని, ఆ దన్నుతోనే ''ఆహర హక్కు'' చట్టాన్ని చేశామని గుర్తించాలి. ఆ వ్యవసాయాన్ని హరిత విప్లవ ఫలిత పంటల సాగని నార్మన్‌ బోర్లాగ్‌ వంటి వ్యవసాయ శాస్త్రజ్ఞులతోపాటు కొందరు రాజకీయ విశ్లేషకులు మనకు నేర్పారు. ఈ విప్లవ మూల కారకులుగా ప్రొ|| స్వామినాథన్‌, సి. సుబ్రమణ్యం, ఇందిరాగాంధీ లనీ విశ్లేషకులు వివరించారు. అయితే హరిత విప్లవ రెండో పార్శ్యం విత్తనాల గుత్తాధిపత్యం, రసాయనాల అదుపులేని వాడకం, మానవ శ్రమ బదులు ప్రవేశించిన యంత్రాల వల్ల కలిగే నష్టాంతరువాతి దశలో బయటపడ్డది. అలానే రసాయనాల వల్ల జరిగే నష్టాంప్రజారోగ్యం, పర్యావరణాలు దిగజారటాంతీవ్ర స్ధాయిలో అమెరికా, ఐరోపా దేశాల్లో మాదిరి వెలుగులోకి వచ్చింది. ఆ దశలోనే ఈ సేంద్రియ సేద్యం ముందుకొచ్చింది. భారత దేశంలో ఎందరో వ్యవసాయ, సామాజిక ఉద్యమకా రులు దానికి రూపమిచ్చారు. వారిలో డా|| నమ్మాళ్వార్‌, భాస్కర్‌ సావె వంటి వారు ముఖ్యులు. అలాగే రసాయనాలు లేని వ్యవసాయ విధానాల రూపకల్పనలో డా|| సతీష్‌ (దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ), డా|| జి.వి. రామాంజనేయులు (సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ ) వంటి వారు చొరవ చూపారు. ఈ ధోరణికి చోదకశక్తిగా రెకెల్‌ కార్సన్‌, సునీతా నారాయణ్‌, వందానా శివ వంటి అనేక మంది పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు పని చేస్తే, మొసానోబు ఫుకువొకా (జపాన్‌) వంటి వారు ప్రత్యామ్నా యాల వైపు దృష్టి నిలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపాల్లో కూడా ఎందరో వ్యవసాయాపర్యావరణ రక్షకులు తమ తమ అవగాహనల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను రూపొందిం చారు.

ఆ క్రమం లోనే సుభాష్‌ పాలేకర్‌ మన ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం (తన ఆవిష్కరణగా తనే చెప్పుకొని)పై విస్తరణ వ్యాపకం మొదలెట్టారు. గమ్మత్తుగా ఆధునికతకు, నూతన ఆవిష్కరణల ఆచరణకు పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులు, ఐ.ఎ.ఎస్‌ అధికారులు, సామాజిక రంగ నిష్ణాతులు దాన్ని (ప్రకృతి వ్యవసాయాన్ని) భూజాన వేసుకొన్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సేద్యం లోని కీలక అంశాలైన దేశీయ ఆవు, దేశీయ విత్తనాలు, దేశీయ కషాయాలు - వాటిని ప్రయోజక ప్రచార అంశాలుగా చేసుకొన్నారు. ప్రజాసేవ, ప్రజారోగ్యం, పర్యావరణం మీద కొంత శ్రద్ధ ఉన్న వ్యాపారులు, ఈ ప్రకృతి వ్యవసాయ ప్రచారానికి ఆర్థిక సహకారాన్ని అందించారు. వివిధ అధ్యయన నిపుణుల ద్వారా, ఈ పద్ధతి వల్ల దిగుబడులు పెరిగాయని, రైతులు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడ్డారని తెలియజేప్పే సర్వేలు చేయించారు. ఇందులో వ్యవసాయాభివృద్ధికి కీలకమైన వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖల ప్రమేయం లేదు. ఆంధ్రప్రదేశ్‌ లో దాదాపు 3-4 లక్షల మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారని, వాళ్లిచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ వ్యవస్ధ రూపొందుతుందని ప్రచారం జరుగుతున్నది. దేశంలో సిక్కిం, కేరళ వంటి రాష్ట్రాలు ఈ సేంద్రీయ సాగు పద్ధతులకు ప్రోత్సాహాలిస్తున్నట్లు తెలుస్తున్నది. అలాగే తమిళనాడు ప్రభుత్వం ఈ సేంద్రియ సాగు ప్రత్యేకతలను విలువను అంచనా వేసే నిమిత్తం, తమ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పచెప్పింది. తర్వాత మాత్రమే విస్తరిస్తామని ప్రకటించింది. సేంద్రియ సాగు పద్ధతుల ప్రత్యేకతలను పరిశీలించే పథకాలను, ఆర్థిక కేటాయింపులను దేశంలోని పరిశోధనా సంస్ధలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నడుపుతున్నాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్‌) ఆర్థిక వనరులను, మానవ వనరులను కేటాయించింది. కొన్ని విశ్వవిద్యాలయాలు, ఈ సేంద్రియ సాగుపై డిగ్రీలు, డిప్లమాలు కూడా ఇస్తున్నాయి.

అదే విధంగా ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ ఈ ప్రత్యామ్నాయాల్ని ప్రోత్సహిస్తున్నది. ఆ క్రమంలో క్యూబా తమకు అనుకూలమైన సేంద్రియ వ్యవసాయాన్ని రూపొందిం చుకోవటాన్ని ఎఫ్‌.ఐ.ఒ గమనించి ప్రోత్సాహకాలను ప్రకటిం చింది. ఇది పర్యావరణ పరిరక్షణకు, వ్యక్తిాసమాజ సమ తుల్యత అభివృద్ధికి కీలక అంశంగా వుందని ప్రశంసించింది. ఇటువంటి కుటుంబ వ్యవసాయం ప్రపంచ అభివృద్ధి లక్ష్యాల్లో ఒక అంశంగా ఉండాలని భావించారు. క్యూబా పర్యావరణ, ప్రజారోగ్య రక్షణ వ్యవసాయంలో సైన్స్‌ాసాంకేతికాలిచ్చిన జీవన ఎరువులు, మనుషులు, జంతువుల విసర్జకాలు, సూక్ష్మక్రిములు, కృత్రిమంగా అభివృద్ధి చేసే పురుగుాతెగుళ్లను అదుపు చేయగల పరాన్న భుక్కులు ముఖ్య పాత్ర వహిస్తాయి. పంట సాగులో వైవిధ్యం, పంట మార్పుల్లో శాస్త్రీయత, సమగ్ర సస్యపోషణారక్షణ ఆచరణలపై నిఘా వ్యవస్ధ క్యూబా వ్యవసాయాన్ని మార్చింది. రాజకీయాఆర్థిక అవసరాలు క్యూబాను ఆ దారిలోకి నెట్టి వుండవచ్చు. అయితే దేశ స్వావలంబనను, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రకృతి వనరులను కాపాడటంలో వారి వ్యవసాయం తోడ్పడుతున్నదని క్యూబా చెప్తున్నది. అంతేగాక ప్రపంచ ఆహారావ్యవసాయ సంస్ధ సైతం దాన్ని అంగీకరించింది.
 

సేంద్రియ సేద్యం సంక్షోభాలను తగ్గించగలదా?

 

 

వ్యాసకర్త :  ప్రొ|| ఎన్‌. వేణుగోపాలరావు 

విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త,
సెల్‌ : 9490098905