Jun 11,2021 21:08

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న రౌతు రామ్మూర్తి

ప్రజాశక్తి-బొబ్బిలి: పౌర సేవల నుంచి తప్పుకునేందుకే ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని వక్తలు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్‌జిఒ హోంలో శుక్రవారం పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు పి.శంకరరావు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రౌతు రామ్మూర్తి మాట్లాడుతూ పౌర సంక్షేమం నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం చెత్తపన్ను వేయడంతోపాటు ఆస్తిపన్ను, నీటిపన్ను పెంచుతోందని విమర్శించారు. ఆస్తిపన్ను 10 రెట్లు పెరుగుతుందన్నారు. చెత్త పన్ను నెలకు రూ.50 వసూలు చేస్తే ఏడాదికి రూ.600 భారం పడుతుందని, ప్రతినెలా 7లోగా చెల్లించకపోతే అపరాధ రుసుం వసూలు చేసేందుకు తీర్మానించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఏటా 5 శాతం యూజర్‌ ఛార్జీలు పెరుగుతాయన్నారు. కుళాయిలకు కూడా మీటర్లు బిగిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. మరుగుదొడ్లకు కూడా యూజర్‌ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టడం అన్యాయమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి వేణు మాట్లాడుతూ ప్రజలకు ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వం.. పన్నులు వేసి భారం మోపడం అన్యాయమన్నారు. నగదు బదిలీ పథకాలు అమలు చేసి ధరలు, పన్నులు పెంచడం దుర్మార్గమన్నారు. చెత్తపన్ను పెంచుతూ కౌన్సిల్‌ తీర్మానించడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచితే ప్రతి ఏటా ఆస్తిపన్ను పెరుగుతుందన్నారు.
అన్ని రకాల పన్నులను రద్దు చేయాలని కారుణ్య ఫౌండేషన్‌ చైర్మన్‌ జెసి రాజు, నట సమాఖ్య అధ్యక్షులు కర్రి సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి కె.అప్పన్న, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, లోక్‌సత్తా రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఎ.దామోదర్‌, యుటిఎఫ్‌ జిల్లా నాయకులు జి.వెంకటనాయుడు, పికెఎస్‌ నాయకులు పి.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. దీనిపై ఈ నెల 14న మున్సిపల్‌ కార్యాలయం వద్ద, 16, 17న వార్డు సచివలయాల వద్ద ధర్నాలు నిర్వహించేందుకు రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.