Apr 08,2021 09:20

న్యూఢిల్లీ : దేశంలో కరోనా 2.0 కోరలు చాచుతోంది. గతంలో వయోజనులపై ప్రభావం చూపగా... ఇప్పుడు చిన్నారులపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. నెల రోజుల్లోనే కేవలం ఐదు రాష్ట్రాల్లో 79,688 మంది చిన్నారులు కోవిడ్‌ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పెద్దలకు వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ...ఇప్పటికైతే చిన్న పిల్లలకు టీకా అందుబాటులోకి రాలేదు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో చిన్నారులపై పరీక్షలు జరిపినప్పటికీ... రక్తం గడ్డ కట్టడంతో పాటు, ఏడుగురు మరణించిన నేపథ్యంలో ఆ వ్యాక్సిన్‌ను నిలుపుదల చేసింది.
మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ట్రలోనే 60,684 మంది చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో 5,940 మంది పిల్లలు కోవిడ్‌ బారిన పడగా..922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. కర్ణాటకలో 7,327 మందికి సోకగా..ఐదేళ్ల లోపు చిన్నారులు 871, ఉత్తరప్రదేశ్‌లో 3,004 మంది వైరస్‌ బాధితులవ్వగా...ఐదేళ్ల లోపు చిన్నారులు 471 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఢిల్లీలో 2,733 మంది పిల్లలకు కరోనా సోకగా... ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు. పిల్లల రోగ నిరోధక శక్తి బలహీన పటడం వల్ల ఇలా కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.