Jan 19,2022 08:16

రంగాపురంలో ఉండే రంగయ్య వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు. ఇంటి వద్ద ఒక కుక్కను పెంచుతూ ఉండేవాడు. రంగయ్య ఇంటి దగ్గర ఉన్న చెట్టుపై రెండు కాకులు ఉండేవి. ఆ కుక్కకు కాకులతో స్నేహం ఏర్పడింది. కుక్కకు రంగయ్య పెట్టిన ఆహారాన్ని అప్పుడప్పుడూ కాకులు కూడా వచ్చి తినేవి. రంగయ్య తన పొలంలో చెరుకు తోట వేశాడు. ఒక నక్క రోజూ వచ్చి చెరకును తినేస్తూ ఉండేది. ఎవరు పాడుచేస్తున్నారనే విషయం రంగయ్యకు అర్థం కాలేదు.
ఒక రోజు తన భార్యతో 'మన అప్పులు ఎలా తీర్చాలి? పంట చేతికి వస్తే ఇల్లు మరమ్మతు చేయిద్దాం అనుకున్నాను. కానీ చెరుకు తోటను ఎవరో పాడు చేస్తున్నారు?' అని చెప్పి బాధపడ్డాడు. కాకులు, కుక్క ఆ మాటలు విన్నాయి. 'మనల్ని రంగయ్య ఎన్నో రోజుల నుంచి ఆహారం పెట్టి మంచిగా చూసుకుంటున్నాడు. ఎలాగైనా మనం రంగయ్యకు సహాయపడాలి' అని అనుకున్నాయి.
ఒకరోజు కాకులు, కుక్క చెరుకు తోట దగ్గరకు వెళ్లాయి. తోట బయట చెట్టు మీద కాకులు, చెట్టు వెనుక కుక్క దాక్కొన్నాయి. నక్క చెరుకు తోటలోకి ప్రవేశించే సమయం చూసి, అరుస్తూ నక్క మీద దాడిచేశాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన రామయ్య ఆ సంఘటన చూశాడు. వాటి దెబ్బకి నక్క పరుగెత్తి పోయింది. మరుసటి రోజు నుంచి తోట చుట్టుపక్కలకు రాలేదు. కుక్కతో పాటు కాకులు కూడా సహాయపడినందుకు రామయ్య ఆనందపడ్డారు. అప్పటి నుంచి కుక్కతో సమానంగా కాకులకు కూడా ఆహారం వేయసాగాడు.
- సభావత్‌ చంటి,
9వ తరగతి, జెడ్పిహెచ్‌ఎస్‌, నేరెళ్ల పల్లి,
బాలానగర్‌ మండలం, మహబూబ్‌ నగర్‌ జిల్లా.