Aug 07,2022 00:23
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల: జగనన్న విద్యా దీవెన 4వ విడత ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి ఈ నెల 11న బాపట్లకు వస్తున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నామని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. శనివారం సీఎం పర్యటన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్‌ కార్యాలయం లో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ముఖ్యమంత్రి హెలీకాప్టరు దిగేందుకు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేస్తున్నారు. హెలీప్యాడ్‌ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు, ముఖ్యమంత్రి ప్రసంగిం చే సభా వేదిక, గ్యాలరీ ప్రదేశాలు, స్టాల్‌ పాయింట్స్‌, ప్రవేశం తిరిగి వెళ్లే మార్గాలు, ప్రముఖుల వాహనాల పార్కింగ్‌ స్థలాల వద్ద బందోబస్తు భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్‌ మళ్లింపునకు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో విఐపి గ్యాలరీ, పబ్లిక్‌ గ్యాలరీ, సభా ప్రాంగణ ప్రవేశ మార్గాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు. ఇతర భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.
వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు
బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు ముఖ్యమంత్రి వెళ్లే మార్గాన్ని, సభ ప్రాంగణంలోకి ప్రముఖులు, సామాన్య ప్రజలు వెళ్లే మార్గాలు సభావేదిక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. కర్లపాలెం వైపు నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌నకు వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల, బాపట్ల వ్యవసాయ కమిటీ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని విఐపి వాహనాల పార్కింగ్‌నకు ఏర్పాటు చేస్తున్నారు. చీరాల, గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు, కార్ల పార్కింగ్‌ నకు ఏబీఎం హైస్కూల్‌ కాంపౌండు, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్‌ కోసం ఏబీఎం హైస్కూల్‌ ప్రాంగణంతో పాటు మున్సిపల్‌ హైస్కూలు ప్రాంగణాలను పరిశీలించారు. ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపునకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు తగు సూచనలు తెలియజేశారు. సమావేశంలో బాపట్ల డిఎస్‌పి శ్రీనివాసరావు, చీరాల డిఎస్‌పి శ్రీకాంత్‌, డిసిఆర్‌బి డిఎస్‌పి లక్ష్మయ్య, ఎ శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ నాయక్‌, జిల్లాలోని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.