
అమరావతి : ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నాగులపల్లి శ్రీకాంత్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం సుముఖతగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెల్లడికానున్నట్లు సమాచారం. సిఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఆ పదవితోపాటు సిఎంఓ లో జిఎడి పొలిటికల్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. రెండు బాధ్యతలు ఆయనకు కొంత ఇబ్బందిగా ఉందని, మరొకరిని సిఎంవోలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ సిఎంవోలోకి వెళ్తారని చాలాకాలం నుంచి ఐఎఎస్ అధికారుల్లో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి త్వరలోనే బ్రేకులు పడతాయని అధికారుల్లో చర్చ జరుగుతోంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బి.రాజశేఖర్‌ను సిఎంవోలోకి తీసుకోవాలని ప్రభుత్వం ముందుగా భావించింది. దీనికి సిఎంఓలో ఓ అధికారి బ్రేకులు వేసినట్లు సమాచారం. శ్రీకాంత్ ప్రస్తుతం ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్‌కో సిఎండి గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనను సిఎంఓ లోకి తీసుకొని ప్రవీణ్ ప్రకాష్ చూస్తున్న జిఎడి పొలిటికల్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిఎడి సర్వీసెస్ బాధ్యతలను నిర్వహిస్తున్న శశిభూషణ్ కుమార్‌కు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) గా బాధ్యతలను నిర్వహిస్తున్న కెఎస్ జవహర్ రెడ్డికి పదవి కూడా మార్చవచ్చునని అధికారులు భావిస్తున్నారు. టిటిడి ఈవో నుంచి ఆయయను రిలీవ్ చేసి రాష్ట్ర కేంద్రం సర్వీస్‌లోకి తీసుకురావొచ్చుననే ప్రచారం నడుస్తోంది.