May 17,2022 23:39

కంపెనీల యాజమానుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

ప్రజాశక్తి-అనకాపల్లి
కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులిచ్చి తోడ్పడవలసిందిగా కలెక్టర్‌ రవి సుభాష్‌ పట్టన్‌శెట్టి పారిశ్రామికవేత్తలను కోరారు. కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉన్నాయని, తక్కువ పెట్టుబడితో ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రులను కార్పొరేట్‌ స్థాయికి ప్రభుత్వం తీసుకెళ్లిందని, విద్య వైద్య రంగాలకు సీఎస్‌ఆర్‌ నిధుల తోడ్పాటు అందిస్తే ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జిల్లాలో నైపుణ్యంగల క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలకు నిధులు వెచ్చిస్తే పాఠకులు, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుధ్యంకు సహకారం అందించాలని కోరారు. జిల్లా అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు, జిఎండి ఐసి శ్రీధర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హేమంత్‌, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.