Jul 03,2022 22:30

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ వర్షాకాలంలో బ్యాక్టీరియా అధికంగా ఉండటం వల్ల జలుబు, ఫ్లూ, వైరల్‌ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ జి.లక్ష్మణ ప్రసాద్‌ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్‌లో బోట్‌ క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంట్లో దుమ్మూ ధూళి లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని అధికంగా తీసుకోవాలని అన్నారు. ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకపోతే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. బయట ఆహార పదార్థాలపై ఈగలు వాలడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసిన పదార్థాలను తీసుకోవాలని డాక్టర్‌ లక్ష్మణ ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్‌, రాఘవరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.