Aug 17,2022 23:20

సిపిఐ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి

   ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఈ నెల 26, 27, 28 తేదీల్లో విశాఖలో నిర్వహించే సిపిఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 27వ మహాసభల పోస్టర్‌ను అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 26వ తేదీన జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, అనంతరం జరిగే బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు. అక్టోబర్‌ 14 నుంచి 18 వరకు విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రచారాలు, నినాదాలతో కాలం గడుపుతున్న బిజెపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంపై జాతీయ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నినాదాలకే పరిమితమైందని విమర్శించారు. ఆచరణలో సాధించినది శూన్యమన్నారు. రాష్ట్రంలో వైసిపి మూడేళ్ల పాలనలో అప్పులు తెచ్చి నగదు బదిలీ చేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు, నాయకులు ఎ.విమల, ఎస్‌కె రెహమాన్‌, సిఎన్‌ క్షేత్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు.