
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
సిఫార్సు బదిలీలను వెంటనే నిలిపివేయాలని, జిఒ 117ను తక్షణం ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఆదివారం ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పి.జయకర్ అధ్యక్షతన జరిగింది. తొలుత దాచూరి రామిరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్టిఎఫ్ఐ జాతీయ కార్యదర్శి ఎన్.అరుణకుమారి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ మాట్లాడారు.ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో సంఘాలతో తప్పక సంప్రదింపులు జరపాలన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని ప్రభుత్వానికి సూచించారు. ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి విడుదల చేసిని జిఒ 117ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జిఒ కారణంగా ప్రభుత్వ పాఠశాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానంలో లేనివిధంగా చర్యలు చేపట్టడం సరికాదన్నారు. అధ్యక్షులు జయకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు పోరాటం చేసి సాధించుకున్న కౌన్సిలింగ్ బదిలీల ప్రక్రియకు వ్యతిరేకంగా సిఫార్సు బదిలీలు చేపట్టడం తగదన్నారు. వెంటనే ఇలాంటి బదిలీలను నిలిపేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు వి.శంకరుడు, ఇవిఎస్ఎస్ఆర్.ప్రసాదరావు, ఇ.శ్రీమణి, ఎన్.రవిబాబు, ఎస్‌వివి.తాతారావు, జెవివి.సుబ్బారావు, కె.రమేష్‌బాబు, డివివి.సత్యనా రాయణ, ఐ.విజయబాబు పాల్గొన్నారు.