Oct 16,2020 22:16
సిసిఎల్‌ఎగా మళ్లీ నీరబ్‌ కుమార్‌ : రెండు రోజుల్లో ఏం జరిగిందన్న చర్చ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రెగ్యులర్‌ సిసిఎల్‌ఎగా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీఓ ఆర్‌టి నెంబరు 1615ని విడుదల చేసింది. అటవీ, పర్యావరణశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి బాధ్యతలను, భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న నీరబ్‌ కుమార్‌ను బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఈ రెండు బాధ్యతలను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌కు అప్పగించింది. అయితే 48 గంటలు గడవక ముందే మరలా సిసిఎల్‌ఎగా నీరబ్‌ను నియమించడం పట్ల ప్రభుత్వ వర్గాలతో పాటు అధికారుల్లో చర్చకు దారితీసింది. సిసిఎల్‌ఎగా ఆదిత్య నాథ్‌ దాస్‌ బాధ్యతలు కూడా తీసుకోకముందే మరలా నీరబ్‌కు ఆ పోస్టు కేటాయించడం పట్ల పలు సందేహాలు నెలకొన్నాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇన్‌చార్జ్‌ సిఎస్‌గా నీరబ్‌ పనిచేశారు. ప్రస్తుత సిఎస్‌ నీలం సహాని పదవి డిసెంబర్‌తో ముగియనుంది. సిసిఎల్‌ఎ ఇన్‌చార్జ్‌గా ఉన్న నీరబ్‌కే సహాని తరువాత సిఎస్‌ పదవి వరిస్తుందని అంతా భావించారు. అయితే కొత్తగా ఆదిత్యనాథ్‌ దాస్‌కు సిసిఎల్‌ఎ బాధ్యతలు అప్పగించడంతో సిఎస్‌ రేసులో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. మరలా సిసిఎల్‌ఎ పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం నీరబ్‌కు అప్పగించింది. అటవీ, పర్యావరణశాఖ స్పెషల్‌ సిఎస్‌గా అటవీ శాఖకు సంబంధించిన కొన్ని అనుమతుల విషయంలో ఫ్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయలేదనీ, దీంతో ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు సమాచారం. అందు కోసం బదిలీ చేసి సిసిఎల్‌ఎగా నియమించినట్లు తెలిసింది. నీరబ్‌ను సిసిఎల్‌ఎగా తప్పించడంతో డిసెంబరులో నీలం సహాని పదవీ విరమణ అనంతరం సిఎస్‌ రేసునుండి ఆయన తొలగినట్టేనని వార్తలు వినిపించాయి. ఎవరూ ఊహించని విధంగా తిరిగి సిసిఎల్‌ఎగా నియమించడంతో ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో అర్ధం కాక ఐఎఎస్‌ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.