Nov 30,2022 22:51

ప్రజాశక్తి - కపిలేశ్వరపురం
మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలో 1942వ సంవత్సరం బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన లాకులు శిథిలావస్థకు చేరాయి. 36,388 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించిన లాకుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగు నీటి ప్రవాహాన్ని కట్టడి చేసి మెరక ప్రాంతాలకు నీరందించేందుకు నిర్మించిన ఇరిగేషన్‌ తలుపులకు రంధ్రాలు పడి లీకేజీల తో పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతోంది.
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో సాగునీరు కొరతతో మెరక ప్రాంతాల్లో వరిచేలకు నీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.
పనిచేయని కంట్రోలింగ్‌ వ్యవస్థ
ప్రస్తుతం ఇక్కడ ఎగువ లాకులు దిగువ లాకులు తలుపులు మూతబడి తెరుచుకునే కంట్రోలింగ్‌ సిస్టం సక్రమంగా పనిచేయడం లేదు. ఈ లాకులకు మరమ్మతులు చేసి తలుపులకు నూతన నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించి గతంలో టెండర్లు పిలిచారు. అయితే ఆ టెండర్‌ ప్రక్రియ జరగక పోవడం వల్ల ఆ నిర్ణయం మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో సాగునీరు యథావిధిగా వృథా అవుతూనే ఉంది. ఇక్కడ పనిచేసేందుకు సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు.
లాకుల మరమ్మతులు చేయాలని వినతి
ప్రస్తుతం లాక్‌ సూపరింటెండెంట్‌తో పాటు ఒక లస్కర్‌ మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది నిర్వహించేందుకు నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో అవి నివాసానికి పనికి రాకుండా పోయాయి. దీంతో సిబ్బంది బయట ప్రాంతాల్లో అద్దెకు ఉంటూ ఇక్కడకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.ఈ ప్రాంతమంతా విష సర్పాల కు నిలయంగా మారడంతో సిబ్బంది భయం గుప్పెట్లో విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్పందించి లాకులకు మరమ్మతు పనులతో పాటు సిబ్బంది నివసిం చేందుకు క్వార్టర్లు నిర్మించాలని రైతులు, సిబ్బంది కోరుతున్నారు.