May 17,2022 20:31

న్యూఢిల్లీ : వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సరిగ్గా శివలింగం ఎక్కడ కనుగొన్నారో తెలియచేయాలంటూ సుప్రీం కోర్టు మంగళవారం వారణాసి పాలనా యంత్రాంగాన్ని కోరింది. మసీదు ఆవరణను వీడియో తీయడం నిలుపుచేయాల్సిందిగా వారణాసి అధికారులను ఆదేశించాలని కోరుతూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పై ప్రశ్న వేసింది.
''శివలింగం సరిగ్గా ఎక్కడ కనుగొన్నారు?'' అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. తామింకా నివేదిక చూడలేదని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానమిచ్చారు. బుధవారం ఉదయానికల్లా వివరాలన్నింటినీ అందచేస్తామని చెప్పారు.
నమాజ్‌ చేయడం కోసం ఎవరైనా అక్కడకు వచ్చి పాదాలతో తాకితే, అక్కడ ఎలాంటి శాంతి భద్రతలు తలెత్తకుండా చూసేందుకు శివలింగాన్ని కనుగొన్న ప్రాంతాన్ని వెంటనే మూసివేశారని మెహతా తెలిపారు. నమాజ్‌కు ముందుగా పవిత్ర కర్మల కోసం ఉపయోగించే సరస్సు నీటిలో శివలింగాన్ని కనుగొన్నారు. 'శివలింగం కనుగొంటే ఆ ఏరియాను కాపాడండి, అంతేకానీ నమాజ్‌ కోసం ముస్లింలు మసీదుకు రాకుండా అడ్డుకోవద్దు' అంటూ ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీం కోర్టు కోరింది.
జ్ఞానవాపి మసీదులోని బావిలో శివలింగాన్ని కనుగొన్నామంటూ హిందూ పిటిషనర్ల బృందం సోమవారం పేర్కొన్న నేపథ్యంలోల వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేయాల్సిందిగా స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మసీదు వెనుక గల ఆరాధనా స్థలంలో తాము పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులతో మసీదు ఆవరణను వీడియో తీసిన సందర్భంలో శివలింగాన్ని కనుగొన్నారు. కాగా ముస్లిం పిటిషనర్లు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. అది ఫౌంటెయిన్‌ కానీ, శివలింగం కాదని అన్నారు.
మసీదు ఆవరణను సర్వే చేస్తున్న కమిటీ తన నివేదికను ఇంకా అందచేయకముందే ఆ ప్రాంతాన్ని మూసివేయాలని నగర కోర్టు ఎలా ఆదేశిస్తుందని ముస్లిం పిటిషనర్లు మంగళవారం సుప్రీం విచారణ సందర్భంగా ప్రశ్నించారు. ఎదుటి పక్షం వాదనల ఆధారంగా కోర్టు ఎలా ముందుకు సాగుతుంది? ఒక ప్రాంతాన్ని మూసివేయాలని ఎలా ఆదేశిస్తుంది? అని వారు ప్రశ్నించారు. నగర కోర్టు ఆదేశాలను జారీ చేసిన తీరును చూడండంటూ వారు సుప్రీంను కోరారు.
కాశీ విశ్వనాథ ఆలయానికి పక్కనే జ్ఞానవాపి మసీదు వుంటుంది. మసీదు వెలుపల గోడల వద్ద గల విగ్రహాల వద్ద ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. అలాగే పాత ఆలయ ఆవరణలోని దేవతా మూర్తులను కూడా దర్శించుకోనివ్వాలంటూ కోరారు. ఏడాదికోసారి ఈ ప్రాంతంలో ప్రార్ధనల కోసం అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో మసీదు ఆవరణ, అందులోని మూడు డోమ్‌లు, భూగర్భంలోని బేస్‌మెంట్లు, సరస్సు అన్నింటినీ వీడియో తీయాల్సిందిగా వారణాసి సివిల్‌ కోర్టు ఆదేశించింది. ఇందు కోసం కోర్టు కమిషనర్లను నియమించింది.