Apr 08,2021 23:56

సబ్బవరంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

భీమునిపట్నం : మండలంలోని 9 ఎంపిటిసి స్థానాలకు, జెడ్‌పిటిసి స్థానానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసే సమయంలోనూ తాళ్ళవలస జెడ్‌పి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. టి.నగరపాలెం అంగన్‌వాడీ కేంద్రం, తాటితూరు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటలకు ఓటర్లు చాంతాడంత క్యూలైన్‌లో నిల్చుని కనిపించారు. టి.నగరపాలెంలో ఓటు వేసిన అనంతరం కళ్ళు తిరిగి చెట్టు కింద కూర్చున్న వృద్ధురాలు పి.గురయమ్మకు అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ వాటర్‌ ప్యాకెట్‌ అందజేసి సపర్యలు చేశారు. ఓ వైపు కరోనా ఉధృతమవుతున్నప్పటికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించిన దాఖలాలు ఎక్కడా కానరాలేదు. అయితే మండలంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య సిబ్బంది శానిటైజర్లును అందుబాటులో ఉంచారు.
మన్యంలో ఇలా..
పాడేరు : ఏజెన్సీలోని 11 మండలాలో పోలింగ్‌ సజావుగా సాగింది. పాడేరు డివిజన్‌లో 11 జెడ్‌పిటిసి, 172 ఎంపిటిసి స్థానాలకుగాను ముంచింగిపుట్టు మండలంలో 1 (బాబుసాల) పెదబయలు మండలంలో 2 (జామిగూడ, ఇంజరి) ఏకగ్రీవమయ్యాయి. 169 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 186 సమస్యాత్మక, 115 అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో తగిన భద్రత చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఐటిడిఎ పిఒ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ సలిజామల, ఆర్‌డిఒ కె.లక్ష్మి శివజ్యోతి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల, బ్యాలెట్‌ బాక్సుల భద్రతా చర్యలను తనిఖీ చేశారు. పోలీస్‌ బందోబస్తు, సిసి కెమెరాలు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఐటిడిఎ పిఒ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ సలిజామల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని గవర్నమెంట్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో వీరు ఓటు వేశారు.
అనకాపల్లి : పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకూ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్‌పి కృష్ణారావు సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా తుమ్మపాలలో జరుగుతున్న ఎన్నికల సరళిని డిఎస్‌పి శ్రావణితో కలిసి పరిశీలించారు. ఆయన వెంట పట్టణ సిఐ భాస్కరరావు, ఎస్‌ఐలు ధనుంజరు, రామకృష్ణ ఉన్నారు.
పలు పోలింగ్‌ కేంద్రాలను ఆర్‌డిఒ జె.సీతారామారావు పరిశీలించారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 239 ఎంపిటిసి, 12 జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు.
మండలంలో తొలుత పోలింగ్‌ మందకొడిగా సాగింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించడంతో అధికార వైసిపి నాయకులు, కార్యకర్తల హడావుడే గ్రామాల్లో కనిపించింది. ఎంపీ సత్యవతి పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.
పెదబయలు రూరల్‌ : మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. పర్రెడ పంచాయతీలో మండుటెండను సైతం లెక్క చేయకుండా వచ్చి వికలాంగుడు ఓటు వేశాడు.
కొయ్యూరు : మండలంలోని తన సొంత గ్రామమైన శరభన్నపాలెంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు. రావణంపల్లి పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నల్లగొండ పంచాయతీలో వైసిపి మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ, సర్పంచ్‌ రాజకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఎం.భీమవరం, యు.చీడిపాలెంల్లోనూ ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. 52.2 శాతం పోలింగ్‌ నమోదైంది.
హుకుంపేట : మండలంలో 68 శాతం పోలింగ్‌ నమోదైంది. మండల కేంద్రంలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తడిగిరి పంచాయతీలో వృద్ధురాలిని మోసుకుంటూ వెళ్లి పోలీసాధికారి ఓటు వేయించారు. అన్నిచోట్లా సజావుగా పోలింగ్‌ జరిగినట్లు మండల ప్రత్యేకాధికారి రవి కుమార్‌ తెలిపారు.
డుంబ్రిగుడ : పోతంగి పంచాయతీలో ఉదయం 6 గంటలకే ఓటర్లు బారులు తీరి కనిపించారు. పలుచోట్ల ఎండలో నిల్చునే గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్ణీత గడువు ముగిసినా పోలింగ్‌ కేంద్రం లోపల ఓటర్లు ఉండిపోవడంతో పోలింగ్‌ కొనసాగింది. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
పెదబయలు : మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 48.58 శాతం పోలింగ్‌ నమోదైంది. మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఇంజరి, జామిగూడ, గిన్నెలకోట పంచాయతీల్లో ఉదయం మందకొడిగా, మధ్యాహ్నం జోరుగా పోలింగ్‌ సాగింది.
కశింకోట : మండలంలో 65.59 పోలింగ్‌ శాతం నమోదైంది. వైసిపి జెడ్‌పిటిసి అభ్యర్థి దంతులూరి శ్రీధర్‌ రాజు కన్నూరుపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి దాకారపు దార వరలక్ష్మి, కాంగ్రెస్‌ అభ్యర్థి కత్తిర శ్రీధర్‌, బిజెపి అభ్యర్థి ముత్యాల మహాలక్ష్మి వారి స్వప్రాంతాల్లో ఓటు వేశారు. తాళ్ళపాలెం, కన్నూరుపాలెం పోలింగ్‌ కేంద్రాలను ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పరిశీలించారు.
పద్మనాభం : 15 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కొవ్వాడ, అనంతవరం, మద్ది గ్రామాల్లో మందకొడిగా తొలుత పోలింగ్‌ సాగింది. మండల వ్యాప్తంగా 61 శాతం పోలింగ్‌ నమోదైంది.
అచ్యుతాపురం రూరల్‌ : పోలింగ్‌ కేంద్రాలను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సిహెచ్‌.రంగయ్య, చిన్నం నాయుడు, ఎంపిడిఒ కృష్ణ, తహశీల్దార్‌ రాంబాబు పర్యవేక్షించారు. మోసయ్యపేట గ్రామంలో సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి రొంగలి రాము ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నక్కపల్లి : మండలంలో 66.95 శాతం పోలింగ్‌ నమోదైంది. 23 ఎంపిటిసి స్థానాలకుగాను డొంకాడ, దోసలపాడు ప్రాంతాల్లో వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. జానకయ్యపేట ఎంపిటిసి స్థానంలో బరిలో నిలిచిన అభ్యర్థి మృతిచెందారు. దీంతో మిగిలిన 20 స్థానాల్లో ఎన్నిక నిర్వహించేందుకు 72 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేసారు. ఎంపిడిఒ రమేష్‌ రామన్‌, తహశీల్దార్‌ వివి.రమణ పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి, పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్‌ జరుగుతున్న తీరును నాయకులను అడిగి తెలుసుకున్నారు. సిఐ విజరు కుమార్‌, ఎస్‌ఐ అప్పన్న ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
అరకు లోయ: మండలంలో 62.87 పోలింగ్‌ శాతం నమోదయింది. అరకులోయలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
సబ్బవరం : పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ వి.వినరు చంద్‌ పరిశీలించారు. ఏర్పాట్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రత్యేక అధికారి ఎమ్‌.నాగమల్లేశ్వరరావు, ఎంపిడిఒ రమేష్‌ నాయుడు, తహశీల్దార్‌ రమాదేవి ఉన్నారు.
ఆనందపురం : 80.79 శాతం పోలింగ్‌ నమోదైంది. 17 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ నుంచి జెడ్‌పిటిసిగా పోటీ చేస్తున్న తర్లువాడ గ్రామానికి చెందిన తాట్రాజ్‌ ఆదినారాయణ ఇటీవల మృతిచెందడంతో జెడ్‌పిటిసి ఎన్నిక వాయిదా పడింది.
అనంతగిరి : 55 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎగువశోభ పంచాయతీ పరిధిలోని బాలికల పాఠశాలలో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచారు.
జికె.వీధి : 42.76 శాతం ఓటింగ్‌ నమోదైంది. జికె.వీధిలో ఉదయం మందకొడిగా ఓటింగ్‌ సాగింది. రింతాడ, దేవరాపల్లిలలో ఓటర్లుకు సరైన సదుపాయాలు కల్పించలేదు. రింతాడలో సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి శాంతి, జికె.వీధిలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
నాతవరం : నాతవరం మండలంలో 18 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానాలకు జరిగే ఎన్నికల్లో 50 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు. మండలంలో మొత్తం 64 పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు ఓటు హక్కును వియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలను తహశీల్దార్‌ జానకమ్మ పరిశీలించారు. నాతవరం ఎస్సై జె.రమేష్‌ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుడా బందోబస్తు నిర్వహించారు. జనసేన సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర చెర్లోపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దేవరాపల్లి : దేవరాపల్లి మండలంలో జెడ్‌పిటిసి స్థానానికి నలుగురు, 17 ఎంపిటిసి స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీ చేశారు. టిడిపికి చెందిన చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు సొంత గ్రామమైన తారువలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసిపి జెడ్‌పిటిసి అభ్యర్థి కర్రి సత్యం, ఎంపీపీ అభ్యర్థి కిలపర్తి రాజేశ్వరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వడ్డాది : మండలంలో 19 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానాలకు సంబంధించి 60 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జెడ్‌పిటిసి బరిలో ఐదుగురు, ఎంపిటిసిల బరిలో 45 మంది అభ్యర్థులు ఉన్నారు. వలస ఓటర్లు పెద్దగా రాలేదు. చోడవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు, గోవాడ సుగర్స్‌ మాజీ చైర్మన్‌ దొండా కన్నబాబు, వైసిపి జడ్‌పిటిసి అభ్యర్థి దొండా రాంబాబు వడ్డాదిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు
వడ్డాది పోలింగ్‌ కేంద్రాన్ని మంగళవారం అనకాపల్లి ఎంపీ బివి.సత్యవతి పరిశీలించారు. ఆమె వెంటే వడ్డాది ఉప సర్పంచ్‌ దాడి సూర్యనాగేశ్వరరావు ఉన్నారు.
నాతవరం : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా), నర్సీపట్నం ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు గురువారం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. నాతవరం మండలం ఎం.బెన్నవరం, ములగపూడి, శృంగవరం గ్రామాలలో పర్యటించి పోలింగ్‌ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లను, ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు బి.రామారావు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.
మాకవరపాలెం : మాకవరపాలెం మండలంలో ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మాకవరపాలెం ఎస్సై కరక రాము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోటవురట్ల : మండలంలో 69.70 శాతం పోలైనట్లు ఎంపిడిఒ సువర్ణరాజు తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులను మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాలలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. పలు పోలింగ్‌ కేంద్రాలను ఎఎస్‌పి తుహిన్‌ సిన్హా పర్యవేక్షించారు.
చీడికాడ : మండలంలో 13 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ 74 శాతం నమోదైనట్లు ఎంపిడిఒ జయప్రకాష్‌, మండల ఎన్నికల అధికారి మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ సంతోష్‌ ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను సీల్‌ చేసి ఏపీ మోడల్‌ స్కూల్‌ కి తరలించారు.
కొత్తకోట : రావికమతం మండలంలో 20 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చినపాచిల గ్రామంలో సాయంత్రం 5 గంటలకు భారీ స్థాయిలో ఓటర్లు క్యూలైన్‌లో ఉన్నారు. పలు పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల ప్రత్యేకాధికారి రాజ గోపాల్‌, తహసీల్దార్‌ కనకరావు పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో కొత్తకోట సిఐ లక్ష్మణమూర్తి ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటుచేశారు.
బుచ్చయ్యపేట : మండలంలో 19 సెగ్మెంట్లకు 60 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేశారు. వృద్ధులను ఆటోలు, ద్విచక్రవాహనాలపై తరలించారు.
సోషల్‌ మీడియాలో బ్యాలెట్‌ పేపర్‌
బుచ్చయ్యపేట ఎంపిటిసి రెండో సెగ్మెంట్‌కు చెందిన బ్యాలెట్‌ పేపర్‌ వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఓ వ్యక్తి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టారు.
గొలుగొండ : మండలంలో 71 శాతం పోలింగ్‌ నమోదైంది. జెడ్‌పిటిసి అభ్యర్ధులు సుర్ల వెంకటగిరిబాబు, అడిగర్ల అప్పలనాయుడు మండల మొత్తం మీద తిరిగారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గొలుగొండ ఎస్‌ఐ డి.ధనుంజయనాయుడు, కేడిపేట ఎస్సై పైడిరాజు తమ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. మండలంలోని ఎఎల్‌.పురం పోలింగ్‌ కేంద్రాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ పరిశీలించారు.
నర్సీపట్నం టౌన్‌ : నర్సీపట్నం మండలంలో తొమ్మిది ఎంపిటిసి, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపిటిసిలకు 22 మంది, జెడ్‌పిటిసికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మాస్క్‌ ధరిస్తేనే క్యూలైన్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
రోలుగుంట : రోలుగుంట మండలంలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్‌ఐ ఉమామహేశ్వరరరావు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెందుర్తి : పెందుర్తిలో సాయంత్రం ఐదు గంటల దాటిన తర్వాత కూడా క్యూ లైన్‌లో ఓటర్లు ఉండటంతో రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. 84.07 శాతం పోలింగ్‌ నమోదైంది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్‌రాజు దంపతులు రాంపురంలో ఓటు వేశారు.
కె.కోటపాడు : మండలంలో 17 ఎంపిటిసి సెగ్మెంట్లకుగానూ 16 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. దాలివలస సెగ్మెంట్‌ అభ్యర్థి ఇటీవల మృతిచెందడంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగలేదు. మండలంలో 53 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
మాడుగుల : మండలంలో జరిగిన 19 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 69.68 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బంద్‌బస్తు నిర్వహించారు.