
ప్రజాశక్తి-పాడేరు టౌన్: మాతా శిశు మరణాలపై ఎంఎల్‌హెచ్‌పిలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని డిఎం అండ్ హెచ్‌ఒ సి.జమాల్ భాషా సూచించారు. ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం పాడేరు డివిజన్ పరిధిలోని 35 పిహెచ్‌సిలలో కొత్తగా నియమితులైన రెండవ బ్యాచ్ ఎంఎల్‌హెచ్‌పిలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్యం, హైరిస్క్ గర్భిణీల సమాచారం, మాతా శిశు మరణాలపై ఎంఎల్‌హెచ్‌పిలు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సేవలు పక్కాగా ఉండాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరితో సరైన కమ్యూనికేషన్ ఉంటే ఆరోగ్య పరమైన సమాచారం అందడంతో పాటు వారికి సరైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వ్యాధులపై సరైన అవగాహన కల్పించాలని సూచించారు. రక్తహీనత ఉన్న వారి వివరాలు పొందుపరచాలని, వీరు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యాక్రమంలో వైద్యాధికారులు సింధూరం పడాల్, విఘ్నేష్, జిల్లా గణాంకాదికారి జె.కైలాస్, జిల్లా టిబి పర్యవేక్షకులు వి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.