Jan 26,2022 02:20

సమ్మె లేఖను చూపుతున్న ఉద్యోగులు

ప్రజాశక్తి-పాడేరు: ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ఎపి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా, రాష్ట్ర నాయకులు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ వితషయాన్ని ఎపి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీతో పాటు ఐటిడిఎల పిఒలు, డిడిలకు రాసిన సమ్మె లేఖను విలేకరులకు విడుదల చేశారు. ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక జిఒలను రద్దు చేయాలని కోరుతూ 11వ పిఆర్‌ సి సాధన కమిటీ పిలుపుమేరకు జరుగుతున్న ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎపిటిడబ్ల్యూటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ శ్రీనివాస్‌పడాల్‌, కార్యదర్శి జి.శేషగిరిరావు, అసోసియేట్‌ అధ్యక్షులు పి.కృష్ణారావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుర్తాడి రామారావు, కంబిడి నీలకంఠం, హెచ్‌ఎం అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి. పూర్ణచంద్రరావు, ప్రతినిధులు పి.నాగేశ్వరరావు ఎం.గంగాభవాని, టి.లింగమూర్తి, సిఆర్‌టి యూనియన్‌ రాష్ట్ర నాయకులు టి.నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.