Mar 02,2021 20:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నూతన వ్యవసాయ చట్టాలపై చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు, కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యమ కార్యాచరణ, రానున్న రోజుల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మంగళవారం జాతీయ రైతు, కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు. మోడీ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని వీడి రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు సంఘాలతో చర్చలు జరపాలని పునరుద్ఘాటించారు. అదేవిధంగా అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర(ఎంఎస్‌పి) కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ హామీ ఇచ్చిన విధంగానూ సి2 ప్లస్‌ 50 శాతం ప్రకారం ఎంఎస్‌పి ఇవ్వాల్సిందేనని సంయుక్త తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా, కఅష్ణ ప్రసాద్‌, సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, సహాయ కార్యదర్శి ఎఆర్‌ సింధూ, ఐఎన్‌టియుసి అధ్యక్షుడు సంజీవరెడ్డి, అశోక్‌ సింగ్‌, ఎఐటియుసి అధ్యక్షురాలు అమర్‌జీత్‌ కౌర్‌, రైతు స్వాభిమాన్‌ వేదిక నేత యోగేంద్ర యాదవ్‌, సంయుక్త కిసాన్‌ నేత బల్దేవ్‌ సింగ్‌ నిహాల్‌దార్‌, ఆర్కే శర్మ తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న కేంద్ర పెద్దలు రైతు సంఘాలతో ఎందుకు తదుపరి చర్చలు జరపడం లేదని నేతలు ప్రశ్నించారు. ఇప్పటి వరకు 11 సార్లు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని పేర్కొన్నారు. తక్షణం వ్యవసాచయ చట్టాలు రద్దు చేసి, ఎంఎస్‌పి విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని రైతు, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.

లేబర్‌ కోడ్‌లపై పోరాటం చేస్తాం : తపన్‌సేన్‌
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతోపాటు, లేబర్‌ కోడ్‌ చట్టాలను అప్రజాస్వామికంగా ఆమోదించుకోవడంపై ఉద్యమిస్తామని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ వెల్లడించారు. కార్మిక సంఘాలు చెబుతున్న అంశాలను పరిశీలించకుండానే ఆ చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదించుకున్నారని అన్నారు. ఇంటర్‌ నేషనల్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌(ఐఎల్‌ఓ) సిఫార్సలను కూడా పరిగణలోకి తీసుకోలేదని ఆన్నారు. కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలను చట్ట ప్రకారం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

బెదిరిస్తే పోరాటం ఆగదు : హన్నన్‌ మొల్లా
ఉద్యమకారులను బెదిరిస్తే, వేధింపులకు గురిచేస్తే పోరాటం ఆగదని ఎఐకెఎస్‌ ప్రధాన కారదర్శి హన్నన్‌ మొల్లా స్పష్టం చేశారు. రైతాంగ ఉద్యమంలో ఇప్పటికీ 248 మృతి చెందారని, వందలాదిపై కేసులు నమోదు చేశారని, అయినా, రైతు ఉద్యమం ఏమైనా ఆగిందా? అని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. రైతు నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఘాజీపూర్‌ సరిహద్దును పోలీసులు మరోసారి మూసివేశారు. రైతులు ఢిల్లీలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని సరిహద్దులో బారికేడ్ల సాయంతో మూసివేసినట్టు చెప్పారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.