Oct 25,2021 06:47

ఒక ఆకురాలు కాలంలో
నీతో పంచుకున్న విషయమిది...
దాటడానికి ఆ చరిత్ర కాలువలో
మనం దాచుకున్న
రక్తపు ఇటుకలను
మాంసపు పునాది రాళ్ళను
పరుచుకుంటూ వచ్చాం కదా!
చూశావా, ఎంతమంది తలలు తెగి
ఆ దారంతా వృద్ధి చెందిందో...
చూడ్డానికి ఎంత అలంకారంగా
కనుల విందుగా వుందో...
దగ్గరకెళ్ళి లోలోపలికి చూస్తే...
తెగిన నరాల కుచ్చులు
పాయలు పాయలుగా
కొన్ని కోట్లాది అల్లుకోబడి
దూరం నుంచి ఒక
కళాఖండంగా అగుపడుతుంది!

ఒక రహస్యం చెప్పనా...
ఇంకా ఆ నరాల్లో వేడినెత్తురు
ప్రవహిస్తూనే ఉంది
అది ఈ భూతలం ఉన్నంతవరకూ
అలాగే ఉంటుంది
కాలగర్భంలో పూడ్చుకుపోయిన
పుర్రెల్లోంచి నిశ్శబ్దంగా ఒక
నాదం వినబడుతూనే ఉంది
ఎక్కడికక్కడ చేతులూ కాళ్ళూ
ఏ అరణ్యాలవైపు
ఆకాశపు దేశంలోకి నోళ్ళు తెరిచి
ప్రాణం విడిచుంటారో..!
మడమలు మన భవిష్యత్తు
తలలకు గిలగిలా కొట్టుకొని
కోల్పోయి ఉంటారు
బుసలు కొట్టే ఊపిరిని...

ఇదిగో, ఇది హేమంతం వచ్చే సమయం
నేనూ వెళ్తున్నాను
నా ఎపిటాఫ్‌ను రాసుకోవడానికి
అయ్యో! ఎంత తేలిగ్గా
సోమరిగా బతికేస్తున్నాం
అంత భయానకమైన
త్యాగాల తలల ఎదల పైన
వాళ్ళు వాళ్ళ రక్తమాంసాలను
గుండెను మేధస్సును చిలికి కదా
మనకు ఈ స్వేచ్ఛాయుత
ఊపిరిని మూటగట్టి ఇచ్చింది
ఎంత అన్యాయం చేస్తున్నాం
కించిత్‌ కనికరం కూడా లేకుండా
అదే రాయడానికి వెళ్తున్నా
కనీసం ఇప్పుడన్నా
నగంగా ఒప్పుకుని...
బతుకుకు గౌరవాన్నిస్తూ..!
- రఘు వగ్గు
79782 45215