Nov 26,2021 01:57

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
కార్మికులు.. రైతులు.. కూలీలు, వృత్తిదారులు.. చిరువ్యాపారులు.. ఉద్యోగులు.. ఇలా సామాన్యులెవరైనా, వారి పక్షాన నిలబడేది, వారికి అండగా ఉండేది, వారి తరుపున పోరాడేది సిపిఎం మాత్రమే. కోవిడ్‌ కాలంలో ప్రాణభయంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకురాని పరిస్థితుల్లోనూ సిపిఎం కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలబడ్డారు. ఏ పార్టీ, ప్రభుత్వం, అధికారయంత్రాంగం పట్టించుకోకపోయినా, దాతల సహాయంతో వలస కార్మికులను సిపిఎం ఆదుకుంది. పేదలకు సరుకులు పంపిణీ చేసింది. సిపిఎం చేపట్టిన పోరాటాలు, సేవా కార్యక్రమాలు పరిశీలిస్తే ప్రజల పట్ల ఆ పార్టీకున్న విశ్వాసం, పేదల పట్ల దానికున్న ఔదార్యం అర్థమవుతోంది.
కె.కోటపాడు మండలం కె.సంతపాలెంలో దళితుల భూములు అన్యాక్రాంతంపై పోరాడింది. అక్రమంగా కేసులు పెట్టి, జైలుకు పంపినా ఎదురొడ్డి నిలబడి 18 ఎకరాల భూమి దళితులకు సిపిఎం అప్పగించగలిగింది. వైజాగ్‌-చెన్నై కారిడార్‌ కింద నక్కపల్లి మండలం డిఎల్‌.పురంలో పేదల సాగులోని భూములకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేపట్టింది. సబ్బవరం, పరవాడ, గాజువాక మండలాల పరిధిలో 900 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్‌ టౌన్‌షిప్‌ పేరుతో భూములు లాక్కోవాలని చేసిన ప్రయత్నాలపై సిపిఎం పోరాడ్డంతో అది తాత్కాలికంగా నిలిచింది. జిల్లాలో 10 మండలాల పరిధిలో 55 గ్రామాలకు చెందిన 6,116.50 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములు లాక్కునే కుయుక్తులను పోరాటాలతో ఎదుర్కొని, హైకోర్టును ఆశ్రయించి స్టే ద్వారా ల్యాండ్‌ పూలింగ్‌ నిలిచేలా చేసింది. వైజాగ్‌-చెన్నై కారిడార్‌లో భాగంగా చేపట్టిన భూసేకరణ నేపథ్యంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని పోరాడింది. పాటి నుంచి నక్కపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వరకు 10 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించింది. ప్రభుత్వం నిర్వాసితులకు చెల్లించే పరిహారం పెంచింది.
ఉపాధి హామీ పథకం రక్షణ, బకాయిల చెల్లింపు, పని కల్పన వంటి అంశాలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ వచ్చింది. పాల రైతులకు కనీస మద్ధతు ధర కల్పించాలని ఉద్యమించింది. తుమ్మపాల సుగర్‌ ప్యాక్టరీ తెరిపించాలని, ఏటికొప్పాక, గోవాడ, తాండవ చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని, కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఫ్యాక్టరీల వద్ద ధర్నాలు నిర్వహించింది. రావికమతం మండలం అజరుపురం గిరిజన మహిళలు మూడు కిలోమీటర్ల దూరంలోని వూటబావుల నుండి తాగునీరు తెచ్చుకుంటున్న నేపథ్యంలో వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆందోళన చేపట్టి ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను కదిలించింది. నక్కపల్లి మండలం గునుపూడిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించకుండా ఆ గ్రామ ఉపసర్పంచ్‌ బిల్లులు స్వాహా చేయడంపై ఎంపిడిఒ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి ధర్నా చేయడంతో లబ్ధిదారులందరికీ పార్టీ సమక్షంలో బిల్లులు చెల్లించారు. పోలవరం ఎడమకాలువ నిర్మాణంలో ఎస్‌.రాయవరం మండలం దార్లపూడిలో 22 రెల్లి కుటుంబాల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. దీనిపై పార్టీ జోక్యం చేసుకొని నాలుగు రోజులు నిరాహార దీక్షలు చేపట్టడంతో 22 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలం, నష్టపరిహారం అధికారులు చెల్లించారు.
కష్ట కాలంలో ఆపన్న హస్తం
కోవిడ్‌ కాలంలో 38 మండలాల్లో సిఐటియు, యుటిఎఫ్‌ ప్రజా సంఘాల సహకారంతో 16వేల మందికి రూ.33,97,868 విలువైన సరుకులు పంపిణీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌, పరవాడ ఫార్మాలో 35 రోజులు బెంగాల్‌, చత్తీస్‌ఘడ్‌, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ప్రాంతాలకు చెందిన సుమారు 9వేల మంది కార్మికులను అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం పట్టించుకోలేదు. పనుల్లేక, చేతిలో డబ్బుల్లేక, ఇళ్లకు వెళ్లే అవకాశంలేక ఆకలితో బాధపడుతున్న వలస కార్మికులకు సిపిఎం భోజనాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఎస్‌.రాయవరం మండలంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించింది. నక్కపల్లి, చోడవరం, భీమిలి, నర్సీపట్నం మండలాల్లోనూ వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.
కోటవురట్ల మండలంలో గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపోతే, ఐదు కిలోమీటర్లు కాలినడకన కావిడితో సరుకులు తీసుకెళ్లి పార్టీ కార్యకర్తలు పంపిణీ చేశారు. అనకాపల్లి సిపిఎం కార్యాలయంలో 4 నెలల పాటు రైతు బజారు నిర్వహించింది. నష్టపోతున్న రైతులను ఆదుకొనేందుకు వారి నుంచి కూరగాయలు కొనుగోలు చేసి, అదే ధరకు ప్రజలకు విక్రయించింది. అనకాపల్లి పట్టణంలో మొబైల్‌ వాహనంలో మార్కెట్‌ ధర కంటే తక్కువకు కూరగాయలు విక్రయించింది. ప్రతిరోజూ రాత్రిపూట దాదాపు 200 మందికి రెండు నెలల పాటు భోజనం సరఫరా చేసింది. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి, రోగులకు, వారి సహాయకులకు భోజనాలు పంపిణీ చేసింది.