
ప్రజాశక్తి-కొయ్యూరు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కొయ్యూరు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వై.అప్పలనాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, కనీసం వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛను సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఫేస్ యాప్ రద్దు చేయాలని, అంగన్వాడీలను ఐసిడిఎస్ అధికారులు మాత్రమే పర్యవేక్షించాలని కోరారు. బకాయి జీతాలు, పెండింగ్ బిల్లులు, టిఎ, డిఎలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు ఎల్.ముత్యాలమ్మ, డివి.రమణమ్మ, పూర్ణ, దేవుడమ్మ, రాజేశ్వరి, వెంకటరమణ, రత్నం, బంగారమ్మ, కళ, గిరిజన సంఘం నాయకులు ఎస్.సూరిబాబు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
చింతూరు : అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన చింతూరు సెంటర్ నుండి ఐసిడిఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి పోడియం సావిత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల విత్యుత్ బిల్లులు 8 సంవత్సరాల నుండి చెల్లించడం లేదని, దీంతో కార్యకర్తలు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పని చేయడం లేదన్నారు. పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి, అనంతరం సూపర్వైజర్లకు వినత పత్రం ఇచ్చారు. యూనియన్ నాయకులు సవలం వెంకటరమణ, దుర్గ, పార్వతి, వసంత, జయ, భద్రమ్మ, కామేశ్వరి, సావిత్రి, సీఐటీయూ మండల సహాయ కార్యదర్శి బి.దిలీప్, నాయకులు కారం సుబ్బారావు పాల్గొన్నారు.
జి మాడుగుల : లేనిపోని యాప్లతో అంగన్వాడీలను ఒత్తిడికి గురిచేయొద్దని సిఐటియు మండల కార్యదర్శి జె. దీనబంధు, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు నాయకులు ఎం.వెంకటలక్ష్మీ, జి. మోదకొండమ్మ అన్నారు. మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం మండలకేంద్రంలో ఆందోళన చేపట్టారు. సిడిపిఒ సువర్ణకుమారికి 13 డిమాండ్లతో వినతిపత్రాన్ని యూనియన్ నాయకులు అందజేశారు. ప్రాజెక్టు, సెక్టార్ నాయకులు సత్యవతి, రాజేశ్వరి, సింహాచలం, కాంతమ్మ, విజయకుమారి పాల్గొన్నారు.