Feb 06,2023 20:01

కలెక్టరేట్‌ వద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
   కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన కార్యకర్తలు
 కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన కార్యకర్తలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కనీస వేతనాలు అమలు చేయానలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చెయ్యాలని, అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా చేశారు. ఉదయం 10గంటలకే వందలాది మంది కార్యకర్తలు కలెక్టరేట్‌కు చేరుకొని ప్రధాన గేటు వద్ద బైఠాయించారు.
ధర్నాను ఉద్దేశించి ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పైడిరాజు, అనసూయ, సి ఐటియు జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శంకరరావు, కె.సురేష్‌ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు అనేక సేవలు అందిస్తున్నారన్నారని, కానీ ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు లేవని తెలిపారు. కొన్ని కేంద్రాలలో, అసలు విద్యుత్‌ సౌకర్యం లేదని, ఉన్న చోట ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వం టిఎ, డిఎలు చెల్లించడం లేదన్నారు. వైఎస్సాఆర్‌ సంపూర్ణ పోషణ అమలుకు కొన్ని ప్రాజెక్టుల్లో గత 6నెలల నుండి బిల్లులు చెల్లించలేదని, ఫలితంగా అంగన్వాడీలు అప్పులుచేసి లబ్దిదారులకు ఆహారం వండి పెడుతున్నారని అన్నారు. రకరకాల యాప్‌లు తీసుకొచ్చి పనిభారం పెంచారని, కనీస వేతనాలు మాత్రం పెంచడం లేదని అన్నారు. గ్రామాల్లో నెట్‌ సౌకర్యం ఉండటం లేదని, అయినా ఫేస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడం తగదని అన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి నిధులు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పనిభారం తగ్గించి వేధింపులు ఆపాలని కోరారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, ఫేషియల్‌ యాప్‌ రద్దు చెయ్యాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు ఇవ్వాలి సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. 300 జనాబా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సభలను నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 1ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిఐటియు నాయకులు వి.లక్ష్మి, టివి రమణ, బి.సుధారాణి, ఎం.రమణ తదితరులు పాల్గొన్నారు.

   కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన కార్యకర్తలు
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న యూనియన్‌ నాయకులు