Nov 30,2022 22:03

ఏలూరు జిల్లాలో తొలిరోజు చంద్రబాబు పర్యటన
కలపర్రు టోల్‌గేట్‌ వద్ద ఘనస్వాగతం
దెందులూరు ఎంఎల్‌ఎ లండన్‌ బాబు అంటూ తీవ్ర విమర్శలు
ఫెక్ల్సీల వివాదంతో టిడిపి, వైసిపి మధ్య ఘర్షణ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, చింతలపూడి

                వైసిపి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ప్రస్తుత పాలనలో జనం ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఏలూరు జిల్లాలో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' పేరిట మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటన తొలిరోజు బుధవారం సాగింది. ఉదయం 11.20 గంటలకు చంద్రబాబు కలపర్రు టోల్‌గేట్‌కు చేరుకునేసరికి అక్కడికి పెద్దఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. చంద్రబాబుకు గజమాలతో టిడిపి శ్రేణులు స్వాగతం పలికాయి. ఓపెన్‌ టాప్‌ వాహనంపై చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం బైక్‌ర్యాలీగా కార్యకర్తలు ముందు సాగగా వెనుక చంద్రబాబు కాన్వారు కదిలింది. జానంపేట మీదుగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు ర్యాలీ విజయరాయి చేరుకుంది. మార్గమధ్యంలో మహిళలు హారతులిచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. విజయరాయి గ్రామంలోకి చేరుకోగానే జనం పెద్దఎత్తున చేరుకోవడంతో కాన్వారు ముందుకెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. జనం పెద్దఎత్తున రావడంతో చంద్రబాబు ఉత్సాహాంగా తన పర్యటన సాగించారు. విజయరాయిలో తొలుత పలువురి ఇళ్లకు వెళ్లి ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి హాయాంలో కట్టిన ఇంటికి ఇంకా రూ.లక్షకుపైగా రావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఓ మహిళ తెలిపింది. మరో మహిళ తమకున్న రెండు ఎడ్లలో ఒక ఎద్దు వైరెస్‌తో చనిపోయిందని చెప్పగా మరో ఎద్దును కొనుగోలు చేసి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక సెంటరులోని బహిరంగ సభ ప్రాంతానికి చేరుకున్నారు. తొలుత దెందులూరు మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడారు.
ఇలాంటి స్పందన ఎప్పుడూ చూడలేదు
పశ్చిమగోదావరి జిల్లాకు కొన్ని వందలసార్లు వచ్చానని, ఇటువంటి స్పందన మాత్రం ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. స్కూల్‌ పిల్లలు బయటికి రాకుండా గేట్లు వేసినా వారి స్పందనను ఆపలేకపోయారన్నారు. దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బాయి చౌదరిని ఉద్ధేశించి మాట్లాడుతూ ఇక్కడ లండన్‌బాబు ఉన్నాడని, మళ్లీ శాశ్వతంగా లండన్‌ పంపిస్తామని అన్నారు. ఏ పార్టీతో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు. తాడేపల్లిలో ఒక సైకో.. ఇక్కడ ఒక సైకో తయారయ్యాడన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నానన్నారు. కరెంటు, ఆర్‌టిసి ఛార్జీల పెంపు, నిత్యావసరాలు, వంటనూనె, పెట్రో, డీజిల్‌, మద్యం ధరలు పెరుగుదలతో జనం పడుతున్న సమస్యలను వివరించారు. పోలవరంను రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో దెబ్బతీశారని తెలిపారు. చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తిచేసి నీటిఎద్దడి లేకుండా చేద్దామనుకున్నానని, దాన్ని పక్కన పెట్టేశారని అన్నారు. చింతమనేనిపై 29 కేసులు పెట్టారని, అందులో 14 అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టి ఉరితాళ్లు వేస్తారట అని విమర్శించారు. పోలీసుల మెడపై కత్తిపెట్టి పనులు చేయిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతానని, పూర్వ వైభవం తెస్తానని, అది తన బాధ్యత అని తెలిపారు.
ప్లెక్ల్సీల వివాదం
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసిపి నాయకులు పెట్టిన ప్లెక్సీలు వివాదస్పదమయ్యాయి. 'ఇదే మా అదృష్టం.. చంద్రబాబు నువ్వే మా ఖర్మ' అంటూ చింతలపూడి ఎంఎల్‌ఎ ఎలిజా ఫొటోలతో చింతలపూడి, ఫాతిమాపురంలో వైసిపి నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చంద్రబాబు పర్యటన సాగుతుండగా కరెంట్‌ సరఫరా నిలిచిపోవడం వివాదాస్పదమైంది. ధర్మాజీగూడెంలో కొంతమంది యువకులు రోడ్డుపైకి వచ్చి పర్యటన వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు పక్కకు తీసుకువెళ్లడంతో జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తూ చింతమనేని ప్రభాకర్‌ను తిడుతూ వెళ్లారు. ధర్మాజీగూడెంలో బాలికలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. రాత్రి చింతలపూడిలో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం చేరుకుని దండమూడి రామకృష్ణ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన బస చేశారు.
నేడు పర్యటన ఇలా..
రెండో రోజు గురువారం చంద్రబాబు పర్యటన దండమూడి ఫంక్షన్‌ హాల్‌ వద్దనుంచి పోలవరం వరకూ సాగనుంది. బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం, రేపల్లెవాడ, దిప్పకాయలపాడు, తంగేళ్లపాడు, కండ్రిగగూడెం, కన్నాపురం మీదుగా సాగి పోలవరంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు. అనంతరం కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సాగనుంది.