May 16,2022 23:46

మంత్రి అమర్‌నాథ్‌కు చిత్రపటాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదకొండమ్మ జాతర సోమవారం సందడిగా సాగింది. పోలీసుల పహారాలో సిసి కెమెరాల నిఘా నీడలో అమ్మవారి జాతర మహౌత్సవాలు జరుగుతోంది. రెండో రోజు సోమవారం శతకం పట్టు వద్ద కొలువుదీరిన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమై పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. పాడేరు, చింతపల్లి ఎఎస్‌పిలు జగదీశ్‌, తుషార్‌ రూడీ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌ పాయింట్లు, ఇతర భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టే విధంగా సిబ్బందిని సిద్ధం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసు యంత్రాంగం ఉత్సవాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పటిష్టమైన భద్రతతో పాటు నిఘాను పెంచారు. అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తుల కదలికలను, దొంగతనాలను సులువుగా గుర్తించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో, వివిధ ప్రాంతాల్లో 45కు పైగా సిసి కెమెరాలు వినియోగిస్తున్నారు. అరకులోయ, ముంచంగిపుట్టు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తలారిసింగి వద్ద, చింతపల్లి, జి.మాడుగుల నుంచి వచ్చే వాహనాలను సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల, చోడవరం నుంచి వచ్చే వాహనాలను ఎంపిడిఓ కార్యాలయం వద్ద నిలిపి నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్‌, ఇతర సమస్యలు తలెత్తకుండా వాహనాలను వేరే దారుల్లో మళ్లిస్తున్నారు.
మోదకొండమ్మను దర్శించుకున్న మంత్రి అమర్నాథ్‌
మోదకొండమ్మను ఐటి, పరిశ్రమల శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్‌ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే, ఆలయ అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఐటిడిఎ పిఓ రోణంకి.గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎపి మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ టి.నర్సింగరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహచలం నాయుడు, తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రమణ్యశాస్త్రి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదకొండమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆచార సాంప్రదాయం ప్రకారం మంత్రికి ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్‌ నర్సింగరావు దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి చిత్రపటం అందించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
గిరిజన ప్రాంత ప్రజల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పాడేరును అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేసి కొత్త గుర్తింపు తీసుకు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, చింతపల్లి ఏఎస్‌పిలు జగదీష్‌, తుషార్‌ రూడీ, స్థానిక సిఐ బి.సుధాకర్‌, తహసిల్దార్‌ ప్రకాశరావు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న లైటింగ్‌
మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు వచ్చే వారంతా విద్యుత్తు లైటింగ్‌ సెట్టింగ్‌లను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. అమ్మవారి ఆలయం మొదలుకుని ప్రధాన మార్గాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన లైటింగ్‌ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన లైటింగ్‌ ఆకర్షణీయంగా ఉంది.
తరలి వచ్చిన భక్తజనం
మన్యం నలుమూలల నుంచే కాకుండా మైదాన ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణంలో ఎటుచూసినా సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఇల్లు బంధుగణంతో కళకళలాడుతోంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులతో ప్రధాన ఆలయం, శతకం పట్టు వద్ద రద్దీ ఏర్పడింది.