Jan 12,2022 07:58

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సర్కారు ఎన్ని ఆంక్షలు విధించినా, సంక్రాంతి కోడి పందేల పేర వందల కోట్ల రూపాయల జూదం ఏటా రాష్ట్రంలో సాగుతూనే ఉంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో పండగ మూడు రోజుల్లో భారీగా కోడి పందేలు జరుగుతాయి. ఈ పందేల కోసమే ప్రత్యే కంగా ఫారాలను ఏర్పాటు చేసి కోడి పుంజులకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తూ, శిక్షణ ఇస్తారు. ఎంత చేసినా వీటి ధర మహా అయితే రూ.రెండు లక్షల వరకు ఉంటుంది. ఈసారి సంక్రాంతి కోడి పందేల్లో పెరూ కోడి పుంజులు సందడి చేయనున్నాయి. కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన కోళ్ల పోషకులు వందల సంఖ్యలో పెరూ పుంజులను దిగుమతి చేసుకుని పందేలకు సిద్ధం చేస్తున్నారు. పెరూలో కోడి పందేల నిర్వహణ చట్టబద్ధమే. అక్కడ క్రీడా పోటీల తరహాలో ప్రత్యేకంగా కోర్టులు, గ్యాలరీలను ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహిస్తారు. అక్కడ పుంజులు బలంగా ఉండటంతో పందేల ప్రియులు పెరూ నుంచి ఈసారి పుంజులను కొనుగోలు చేశారు. వాస్తవానికి పెరూ పుంజులు ఐదారు నెలల క్రితమే రాష్ట్రానికి వచ్చినా, ఎవరికీ తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు. ఒక్కో పుంజును సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కోడి పందేలు వేసే వారికి వాటిని రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయిస్తున్నారు. విజయవాడ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో సుమారు వంద వరకు పందెం పుంజుల కోసం ప్రత్యేకంగా ఫారాలుండగా, ఒకటి రెండింటిలోనే పెరూ పుంజులు లభిస్తున్నాయి. గోదావరి జిల్లాల నుంచి పందేల రాయుళ్లు విజయవాడ సమీపంలోని ఓ గ్రామానికి వచ్చి పెరూ పుంజులను కొనుగోలు చేసి, తీసుకెళ్తున్నారు.
 

                                                           పుంజుకూ వీసా..!

పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఉండటం విశేషం. ఒక్కో పుంజుకు వీసాకే రూ.60 వేలు చెల్లిస్తుండగా, విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసినట్లు పెరూ పుంజుల ఫారం నిర్వాహకులు ఒకరు తెలిపారు. రాష్ట్రానికి చెందిన పుంజులతో పోల్చితే పందేల్లో పెరూ పుంజులదే పైచేయిగా ఉంటుందని, అందుకే అక్కడ నుంచి పుంజులను తెచ్చి పందేలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి సీజన్‌ కావడంతో పోలీసుల నుంచి ఇబ్బందులు వస్తాయనే భయంతో పెరూ పుంజులను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. చివరకు మీడియాను కూడా వారు అనుమతించడం లేదు.